టాప్ స్టోరి: సంప‌ద‌ల సృష్టిలో టాప్ 10 క్రికెట‌ర్లు

భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అదొక మతం. యూత్ కి అదొక మ‌త్తు. పుట్టింది ఇంగ్లండ్‌లో అయినా ఇండియాని ఏల్తున్న క్రీడ ఇది.;

Update: 2026-02-15 16:30 GMT

భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అదొక మతం. యూత్ కి అదొక మ‌త్తు. పుట్టింది ఇంగ్లండ్‌లో అయినా ఇండియాని ఏల్తున్న క్రీడ ఇది. అయితే ఈ ఆట మ‌న దేశంలో సంప‌ద‌ల్ని పెంచ‌డంలో గేమ్ ఛేంజ‌ర్ గా మారింది. మన క్రికెటర్లు కేవలం మైదానంలోనే కాదు.. సంపాదనలో కూడా రికార్డులు సృష్టిస్తున్నారంటే దానికి కార‌ణం ఈ క్రికెట్. ప్రస్తుత మార్కెట్ విలువ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను బట్టి గణాంకాలు ప‌రిశీలిస్తే 2026 నాటి అంచనాల ప్రకారం... భారతదేశంలోని టాప్ 10 అత్యంత ధనవంతులైన క్రికెటర్లు డేటా ఇలా ఉంది.

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నిక‌ర ఆస్తి విలువ -1250 కోట్లు. ఆ త‌ర్వాత టీమిండియా కెప్టెన్ గా భార‌త‌దేశానికి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన ప్ర‌పంచ క‌ప్ ని అందించిన ప్ర‌తిభావంతుడైన కెప్టెన్ ఎం.ఎస్.ధోని నిక‌ర ఆస్తుల విలువ 1060 కోట్లుగా ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ రూ.350 కోట్లు, యువరాజ్ సింగ్ 291 కోట్లు, గౌతమ్ గంభీర్ 265 కోట్లు, సురేష్ రైనా 215 కోట్లు, రోహిత్ శర్మ 214 కోట్లు, రాహుల్ ద్రవిడ్ రూ.197 కోట్లు, సునీల్ గవాస్కర్ 160 కోట్లు.. నిక‌ర ఆస్తుల‌ను క‌లిగి ఉన్నారు.

క్రికెట్ నుండి రిటైర్ అయ్యి చాలా కాలం అవుతున్నా స‌చిన్ కి ఇప్పటికీ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రేజ్ తగ్గలేదు. అనేక స్టార్టప్‌లలో పెట్టుబడులు, వాణిజ్య ప్రకటనల ద్వారా ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అత్యధికంగా సంపాదించే క్రికెటర్ విరాట్. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు కోట్లాది రూపాయలు వసూలు చేయడంతో పాటు, తన సొంత బ్రాండ్ వ‌న్ 8 ద్వారా భారీగా లాభాలు పొందుతున్నారు. త్వరలోనే అత‌డు ధోనిని దాటి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ స‌హా ధోని ఎంటర్‌టైన్‌మెంట్, జిమ్ నెట్‌వర్క్స్ వంటి వ్యాపారాల‌ ద్వారా ధోని సంపాదన స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉండటంతో పాటు, రాజకీయాలు, వ్యాపారాల ద్వారా ఆయన నికర ఆస్తి విలువ గణనీయంగా పెరిగింది. రిటైర్మెంట్ ప్రకటించినా కానీ, ఐపీఎల్ ఆదాయం, భారీ బ్రాండ్ డీల్స్ ద్వారా రోహిత్ సంపాదన కూడా వేగంగా పెరుగుతోంది. క్రికెట్ ద్వారా వేగంగా ఆర్జిస్తున్న క్రికెట‌ర్ల‌లో హార్థిక్ పాండ్యా వంటి ప్ర‌ముఖుల పేర్లు కూడా ఉన్నాయి.

సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ తన సంపాదనను చాలా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెడుతున్నారు. అగిలిటాస్ స్పోర్ట్స్ లో విరాట్ భారీ పెట్టుబ‌డి పెట్టారు. ఇటీవల తన సొంత బ్రాండ్ వ‌న్ 8ని అగిలిటాస్ స్పోర్ట్స్ అనే కంపెనీకి విక్రయించారు. అయితే ఆ కంపెనీలోనే తిరిగి రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టి వాటాదారుగా మారారు. ఇది ఒక స్మార్ట్ బిజినెస్ మూవ్ అన‌డంలో సందేహం లేదు. గో డిజిట్ లో భార్య అనుష్కతో కలిసి సుమారు 2.5 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆ కంపెనీ ఇప్పుడు బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంది. వ‌న్ 8 క‌మ్యూన్ పేరుతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. అలాగే రాన్ (WROGN) అనే ఫ్యాషన్ బ్రాండ్ ని కూడా విరాట్ ప్రారంభించారు.

ధోని తన ఆస్తులను ఒకే చోట కాకుండా వేర్వేరు రంగాల్లో విస్తరించారు. ప్ర‌స్తుతం అత‌డు `గరుడ ఏరోస్పేస్` అనే డ్రోన్ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టడమే కాకుండా దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) త‌యారీ కంపెనీలో పెట్టుబ‌డి పెట్టారు. ఈ-బైక్స్ తయారు చేసే Eమోట‌రాడ్ లో వాటాలు కలిగి ఉన్నారు. గతంలో బ్లూస్మార్ట్ ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసుల్లో కూడా పెట్టుబడి పెట్టారు. తన ఫ్యామిలీ ఆఫీస్ ద్వారా ఫిన్‌టెక్ , ఫుడ్ (శాఖాహారి - ప్లాంట్ బేస్డ్ మీట్), ఫిట్‌నెస్ (త‌గ్డా ర‌హో) రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నారు.

రిటైర్మెంట్ తర్వాత సచిన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను బిజినెస్ వరల్డ్‌లో చాలా ప్లాన్డ్‌గా కొనసాగిస్తున్నారు. క్విక్ కామర్స్ లో ఆయ‌న ఇన్వెస్ట‌ర్. డెలివరీ యాప్ జెప్టో లో సచిన్ పెట్టుబడి పెట్టారు. అది ప్రస్తుతం యూనికార్న్ కంపెనీగా ఎదిగింది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు విడిభాగాలు సరఫరా చేసే ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీలో సచిన్ ఐపీఓకి ముందే పెట్టుబడి పెట్టారు. దాని షేర్ ధర ఇప్పుడు విపరీతంగా పెరగడంతో సచిన్‌కు భారీ లాభాలు వచ్చాయి. ఇటీవల 10ఎక్స్‌యు పేరుతో అథ్లెయిజర్ (స్పోర్ట్స్ దుస్తులు) బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు.

స‌చిన్ కుమార్తె కూడా తెలివైన పెట్టుబ‌డులు పెడుతూ వ్యాపార‌వేత్త‌గా రాణిస్తున్నారు.

హార్దిక్ పాండ్యా `ద సోల్డ్ స్టోర్` అనే పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్‌లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే కిడ్స్ ఫుట్‌వేర్ బ్రాండ్ ఆరెట్టో లో కూడా ఆయనకు వాటాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రోహిత్ పెట్టుబడులు ఎక్కువ. ముంబైలో సముద్రం ఎదురుగా కనిపిచేలా 30 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌తో పాటు లోనావాలా, హైదరాబాద్‌లలో కూడా ఆయనకు ఖరీదైన ఆస్తులు ఉన్నాయి.

Tags:    

Similar News