లిక్కర్ ట్రాన్స్ పోర్టు కేసు.. ఆ ఐదుగురికి సిట్ ఉచ్చు?
ఏపీ లిక్కర్ స్కాంలో మరికొందరు వైసీపీ నేతలకు ఉచ్చు బిగించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.;
ఏపీ లిక్కర్ స్కాంలో మరికొందరు వైసీపీ నేతలకు ఉచ్చు బిగించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కాంకు అనుబంధంగా మద్యం బాటిళ్ల రవాణాలోనూ అక్రమాలకు పాల్పడినట్లు నలుగురు వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా కేసు నమోదు చేసింది. ప్రస్తుతానికి ఆ నలుగురిని నిందితులుగా చూపకపోయినప్పటికీ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం చూస్తే మునుముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమే హాట్ టాపిక్ అవుతోంది. సుమారు రూ.400 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఇందులో ప్రధాన సూత్రధారిగా ఏ1 కేసిరెడ్డి అంటూ సిట్ కేసు నమోదు చేసింది. కేసిరెడ్డి నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకున్న ఐదుగురు వైసీపీ నేతల పాత్రపైనా విచారణ జరపాలని ప్రభుత్వం సిట్ ను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.
గత ప్రభుత్వంలో మద్యం డిస్టలరీల నుంచి డిపోలకు, డిపోల నుంచి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరకును సరఫరా చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే సంస్థకు రవాణా కాంట్రాక్టు అప్పగించారు. ఈ కాంట్రాక్టు కూడా లిక్కర్ స్కాం సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి బినామీ సంస్థకు కేటాయించినట్లు సిట్ చెబుతోంది. అయితే కేసిరెడ్డి తన సంస్థకు కాంట్రాక్టు తీసుకున్నా, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో డిపోల నుంచి షాపులకు సరుకు రవాణా చేసే బాధ్యతను ఐదుగురు వైసీపీ నేతలకు అప్పగించినట్లు చెబుతున్నారు.
ఈ ఐదుగురు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారే అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బంధువుతోపాటు గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి కుమారుడు, గుంటూరు జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి, రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే, మరో నియోజకవర్గ సమన్వయకర్తకు ఇందులో వాటాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రవాణా చార్జీలను కి.మీ. 13 నుంచి 36 రూపాయలకు పెంచి భారీగా ప్రజాధనం దోచేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లు చేర్చింది బయటపెట్టలేదు. కానీ, ఈ స్కాంకు సంబంధించి గతంలోనే కొందరిని అదుపులోకి తీసుకుని సిట్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా మరో ఎఫ్ఐఆర్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు నేతలు వైసీపీలో రాజకీయంగా బలమైన, కీలక స్థానాల్లో ఉన్నవారే కావడంతో ప్రభుత్వ వైఖరి ఉత్కంఠ రేపుతోంది. రవాణా కాంట్రాక్టు చేసిన వీరిని నేరస్తులుగా చూపుతుందా? లేక సాక్ష్యులుగా విచారించి గత ప్రభుత్వ పెద్దలను మరింత ఇరికించేలా అడుగులు వేస్తుందా? అన్నదే ప్రధాన చర్చగా ఉంది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిట్ ఈ ఐదుగురి విషయంలో ఎలా ముందుకు వెళుతుంది? అన్నది కూడా ఆసక్తిరేపుతోంది. ఏదిఏమైనా లిక్కర్ స్కాంకు సంబంధించి కొత్త ఎఫ్ఐఆర్ రాజకీయంగా ప్రకంపనలు పుట్టించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.