అమెరికాకు అనూహ్యంగా పెరిగిన ఆహార ప‌దార్థాల పార్సిళ్లు

Update: 2020-07-28 07:50 GMT
కారంపొడులు, అల్లం-వెల్లుల్లి, పసుపు, చింతపండు, మిరియాలు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులతో పాటు ప‌చ్చ‌ళ్లు.. గారెలు, జంతికలు, అరిసెలు, సున్నుండలు, లడ్డూలు ఇలా పిండివంటలు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్య‌లో పార్సిళ్లు పెరిగాయి. ఎందుకంటే వైర‌స్ విజృంభ‌ణ అమెరికాలో తీవ్రంగా ఉంది. అక్క‌డ ఉన్న వాళ్లు బ‌య‌ట‌కు వెళ్లలేని ప‌రిస్థితి. అక్క‌డ ఉన్న త‌మ వారి ఆరోగ్యం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ‌స‌భ్యులు గాబ‌రా ప‌డుతున్నారు. దీంతో వారు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఇంటి ఆహారాన్నే తినేలా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆహారా ప‌దార్థాలు.. వంట సామ‌గ్రి.. తినుభండారాలు అమెరికాకు పంపుతున్నారు.

అమెరికాలో ఉన్న తమ పిల్లలు, బంధువుల కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను ర‌వాణా చేస్తున్నారు. అంతర్జాతీయ కొరియర్‌ సంస్థల ద్వారా నిత్యావసర స‌రుకులు పంపుతున్నారు. 90 శాతానికిపైగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వెళ్తున్నాయ‌ని తేలింది. 10 శాతం కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బ్రిటన్‌ తదితర దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆహార ప‌దార్థాలు వెళ్తున్నాయని తెలిసింది. ఇక యూరోప్‌ దేశాల్లో పన్నుల భారం అధికంగా ఉండడంతో ఆ దేశాల్లో ఉన్న తమ వాళ్లకు ఆయా వస్తువులను పంపించే వారి సంఖ్య తక్కువని కొరియర్‌ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. రోజుకు 50 నుంచి 100 క్వింటాళ్ల వరకు వివిధ రకాల ఆహార పదార్థాలు విదేశాలకు తరలివెళ్తున్నాయి. ఇది 500 క్వింటాళ్ల వరకు పచ్చళ్లు, పిండివంటల పార్శిళ్లు వెళ్తున్నట్టు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకింగ్‌లో 10- 25 కిలోల వరకు వస్తువులు ఉంటున్నట్లు చెప్పారు.

అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా తమ ఇంటి నుంచి కావలసిన వస్తువులను తెప్పించుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అక్క‌డి తిండి తిన‌లేక‌పోవ‌డం.. మ‌న‌కు కావాల్సిన వ‌స్తువులు ల‌భించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో సొంతం ప్రాంతం నుంచి పార్సిళ్లు తెప్పించుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా, ఒక్లహామా, న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా తదితర ప్రాంతాలకు ఎక్కువగా పార్సిళ్లు అవుతున్నాయి. ప్ర‌స్తుతం విమానాశ్ర‌యాల్లో దేశీయ, అంతర్జాతీయ కార్గో సర్వీసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్ర‌స్తుతం ప్ర‌యాణ విమానాల క‌న్నా కార్గో విమానాల సంఖ్య పెరిగింది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధార‌ణ రోజుల్లో రోజుకు 17 కార్గో విమానాలు వెళ్తుండ‌గా ప్రస్తుతం 37 విమానాలు వివిధ దేశాలకు వ‌స్తువులు తీసుకెళ్తున్నాయి. మందులు, ఇతర ఫార్మాస్యూటికల్‌ ఉత్పత్తులు, పీపీఈ కిట్లు తదితర వస్తువులతో పాటు ఆహార ప‌దార్థాలు.. నిత్యావ‌స‌ర వ‌స్తువులు రవాణా అవుతున్నాయి.

పేరు పొందిన కార్గో సేవ‌లు అందిస్తున్న డీహెచ్‌ఎల్, ఫెడాక్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు వాటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. ఈ సంస్థలకు అనుబంధంగా హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌లా 250 నుంచి 300కు పైగా అనుబంధ కొరియర్‌ సంస్థలు పని చేస్తున్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొని నేరుగా వారింటికే వెళ్లి ప్యాకింగ్‌ చేసి పార్శిల్‌ సంస్థలకు తరలిస్తున్నారు. రూ.600కు కిలో ధ‌ర నిర్ణ‌యించారు. సరుకు పరిమాణం.. బ‌రువును బట్టి చార్జీల్లో మార్పులు చేర్పులు ఉంటున్నాయి. ఈ విధంగా విమానాల ద్వారా ఆహార ప‌దార్థాల స‌ర‌ఫ‌రా సాఫీగాసాగుతోంది. అక్క‌డ ఇంటి ఆహారం తింటూ త‌మ వారు ఆరోగ్యంగా ఉన్నార‌ని స‌మాచారం తెలుసుకుని ఇక్క‌డున్న వారు సంతోష ప‌డుతున్నారు.
Tags:    

Similar News