ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు దగ్థమైన 2 బోగీలు!
ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ట్రైన్ లో చెలరేగిన మంటలు పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పేలా చేశాయి. రెండు ఏసీ బోగీలు (బీ1, బీ2) పూర్తిగా దగ్థమైన ఈ షాకింగ్ ఉదంతంలో ఒకరు సజీవ దహనమయ్యారు.;
ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ట్రైన్ లో చెలరేగిన మంటలు పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పేలా చేశాయి. రెండు ఏసీ బోగీలు (బీ1, బీ2) పూర్తిగా దగ్థమైన ఈ షాకింగ్ ఉదంతంలో ఒకరు సజీవ దహనమయ్యారు. కొందరు గాయపడ్డారు. సిబ్బంది గమనించి ట్రైన్ ను ఆపేయటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా - ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల వేళలో అగ్నిప్రమాదానికి గురైంది. ఎలమంచిలికి కాస్త ముందున్న పాయింట్ వద్ద లోకో పైలట్లు బోగీలో మంటలు చెలరేగటాన్ని గుర్తించి వెంటనే ఎలమంచిలి స్టేషన్ లో ట్రైన్ ను నిలిపేశారు.
దీంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి స్టేషన్ లోకి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు రెండు బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్థమయ్యాయి. అర్థరాత్రి సమయం కావటం.. మంచి నిద్రలో ఉన్న వేళ.. మంటల కారణంగా దట్టమైన పొగ కమ్మేయటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం ఎవరికి వారు తమ లగేజ్ ను అలా వదిలేసి.. ఏసీ బోగీల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
షెడ్యూల్ కంటే నాలుగు గంటలు ఆలస్యంగా అనకాపల్లి స్టేషన్ కు చేరుకున్న ఈ ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేకులు పట్టేయటంతో మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు. రెండు బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్ కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ట్రైన్ లో ప్రయాణిస్తున్న 2వేల మంది ప్రయాణికులు చలిలో పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఈ ప్రమాద నేపథ్యంలో విశాఖ - విజయవాడ మార్గంలోని రైళ్లన్నీ నిలిపేశారు. అర్థరాత్రి 3.30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు తగలబడిపోయిన రెండు బోగీలను తొలగించి..ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగిలిన బోగీల్లో సర్దుబాటు చేసి రైలునుపంపించే ఏర్పాటు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో బీ1లో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల చంద్రశేఖర్ సుందర్ అను పెద్దాయన మరణించినట్లుగా గుర్తించారు. ఆయనది విజయవాడగా భావిస్తున్నారు.
తగలబడిపోయిన రెండు బోగీల్లోని ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోటకు తరలించి.. అక్కడ రెండు కొత్త బోగీలను జత చేసి.. అక్కడి నుంచి ట్రైన్ ను ఎర్నాకుళానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ - విజయవాడ మార్గంలో నడిచే రైళ్లు అన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ అనూహ్య ఘటనతో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న రెండు బోగీల్లోని ప్రయాణికులు తీవ్ర షాక్ కు గురయ్యారు.