బదిలీ ఆపాలంటూ మంత్రులతో ఫోన్.. ఉద్యోగమే పోయింది
తన బదిలీని నిలిపివేయాలని కోరుతూ మంత్రులతో.. ఎంపీలతో ఫోన్ చేయించిన ఉప కమిషనర్ కు ఏకంగా సస్పెన్షన్ షాకిచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్. అసలేం జరిగిందంటే..;
ఉన్నతాధికారుల ఆదేశాల్ని పాటించాల్సిన అవసరం కింది సిబ్బంది మీద ఉంటుంది. సదరు అధికారులకు ఎంత రాజకీయ పలుకుబడి ఉంటే మాత్రం.. తనపై అధికారి ఆదేశాల్ని గౌరవించాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. అందుకు భిన్నంగా తాను కోరుకున్నది మాత్రమే జరగాలన్నట్లుగా వ్యవహరించే వారికి తిక్క కుదిర్చే ఘటన హైదరబాద్ మహా నగర పాలక సంస్థలో తాజాగా చోటు చేసుకుంది. తన బదిలీని నిలిపివేయాలని కోరుతూ మంత్రులతో.. ఎంపీలతో ఫోన్ చేయించిన ఉప కమిషనర్ కు ఏకంగా సస్పెన్షన్ షాకిచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్. అసలేం జరిగిందంటే..
జీహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా కొత్త జోన్లు.. సర్కిళ్లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవాడిగూడ సర్కిల్ కు అల్వాల్ సర్కిల్ ఉప కమిషనర్ గా వ్యవహరిస్తున్న వి.శ్రీనివాసరెడ్డిని బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అల్వాల్ నుంచి కవాడిగూడకు వెళ్లటం ఇష్టం లేదంటూ సదరు డీసీ మంత్రులు.. ఎంపీలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫోన్ చేయించారు.
దీంతో స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్.. ముందు బాధ్యతలు తీసుకోవాలని.. తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. అయినప్పటికీ సదరు అధికారి శ్రీనివాసరెడ్డి మాత్రం బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శించలేదు. అంతేకాదు.. కమిషనర్ ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ.. బాధ్యతల స్వీకరణకు రిజెక్టు చేశారు.
దీంతో.. కమిషనర్ ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ ఆదివారం ఉత్తర్వు జారీ చేశారు. అంతేకాదు.. ఆయనపై విచారణ పెండింగ్ లో ఉందని.. ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ ను వీడొద్దని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉదంతాన్ని చూస్తే.. తనకు పరిచయాలు ఉన్నాయని.. తనకు రాజకీయ పలుకుబడి ఉందన్న ఉద్దేశంతో తనకు నచ్చినట్లు మాత్రమే జరగాలన్న తీరు ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ తన చేతలతోచూపించారని చెప్పాలి. మొత్తానికి పలుకుబడి పేరుతో హడావుడి చేసే ఈ తరహా అధికారులకు ఆ మాత్రం షాక్ తగలాలేమో?