చంద్రబాబు...జగన్ షేక్ హ్యాండ్ కోసం !

తెలుగు నాట రాజకీయాలు ఒకప్పటికీ ఇప్పటికీ చూస్తే ఎంతో మారిపోయాయి.;

Update: 2025-12-29 07:55 GMT

తెలుగు నాట రాజకీయాలు ఒకప్పటికీ ఇప్పటికీ చూస్తే ఎంతో మారిపోయాయి. వెనకటి రోజులలో వెంకయ్యనాయుడు ఎస్ జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, సీహెచ్ విద్యాసాగరరావు ఇలా వివిధ పార్టీలకు చెందిన వారు అంతా విపక్షంలో ఉంటూనే హైలెట్ అయ్యారు. వారి వెంట పెద్దగా ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు కాదు, కానీ నాటి సీఎంలు వారి మాటలను వినేవారు, వారికి సభాపతి సమయం ఇచ్చేవారు. వారు కూడా సభలో నిర్మాణాత్మకమైన చర్చ జరిపేవారు ప్రజా సమస్యలను లేవనెత్తేవారు. తమ వాగ్దాటి చమత్కారం, తమ భాష, ప్రజా సమస్యల పట్ల ఉన్న నిబద్ధత వంటి వాటితో ఒక్కరే అయినా వంద మంది పెట్టు అన్నట్లుగా ఉండేవారు. వారు చట్టసభలలో చేసిన ఉపన్యాసాలు ఈ రోజుకీ ఉన్నాయి. వారు తమ నాయకత్వ పటిమతో ప్రజాపక్షమైన రాజకీయంతో అందరి మనసు గెలుచుకున్నారు.

రాజకీయ కోణంలోనే :

అయితే తరువాత కాలంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ప్రజా సమస్యల కంటే రాజకీయ కోణంలోనే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు చూడడం అధికార పక్షం కూడా వారికి మైక్ కట్ చేసి సభలో తమ అధికారాన్ని ప్రదర్శించడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. ఇలా ఎన్ని జరిగినా ఒక అసెంబ్లీ అంటే ప్రజలందరి సభ. అక్కడికి అన్ని పార్టీల సభ్యులూ వస్తారు. మెజారిటీ ఉన్న వారు ప్రభుత్వాన్ని నడుపుతారు ప్రతిపక్షంలో ఉన్న వారు ప్రజా సమస్యలను సభ దృష్టికి తెస్తూ పరిష్కారానికి పని చేయాల్సి ఉంటుంది. గట్టిగా చెప్పాలీ అంటే అసెంబ్లీ అంటే అధికార ప్రతిపక్షాలు రెండూ ఉండాలి.

వ్యక్తిగతమైపోతూ :

ఇక సభలో కొన్ని సార్లు చూస్తే దూషణ పర్వం కూడా సాగుతోంది. వ్యక్తిగతంగా కూడా విమర్శలు అధికం అవుతున్నాయి. ఆ పెడ ధోరణుల అల్ల సభల హుందాతనం కూడా తగ్గిపోతోంది అని ప్రజాస్వామ్య ప్రియుల ఆవేదనగా ఉంది. అయితే పరిస్థితి మారాల్సి ఉంది. ఎవరు సభకు వచ్చినా వారిని ప్రజలు ఎన్నుకున్నారు అన్నది మరువరాదు. ప్రతీ ఒక్క ఎమ్మెల్యే వెంటే కనీసంగా రెండు లక్షల మంది ప్ర్జలు ఉన్నారు, వారికి ప్రాతినిధ్యం వహిస్తూ సభకు వస్తున్నారు అన్న మాట. అలాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారు ప్రజల గురించి తమ ప్రాంతం అభివృద్ధి గురించి మాట్లాడితే ఎంతో బాగుంటుంది అన్నది ఉంది.

కేసీఆర్ వచ్చారు :

ఇక తెలంగాణా అసెంబ్లీకి చూస్తే కేసీఆర్ రాక రాక వచ్చారు. ఆయన ఉన్న ప్రతిపక్ష స్థానం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మరీ నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ దృశ్యం టీవీల ముందు చూసిన వారు అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అధికార ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్ధులు రాజకీయంగా బయట అసెంబ్లీలో కాదు, ఇంక శత్రువులు అయితే అంతకంటే కాదు. అందువల్ల అందరూ కూర్చుని తమ అనుభవాన్ని రంగరించి ప్రజా సమస్యల సాధనను కృషి చేయాలన్నదే ప్రజల కోరిక. ప్రజాస్వామ్య ప్రియుల కోరిక కూడా.

జగన్ రావాలి అంటూ :

ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ దృశ్యాన్ని టీవీలలో చూసిన వారు ఏపీలో కూడా చంద్రబాబు జగన్ ల మధ్య ఈ తరహా సన్నివేశాన్ని కోరుకుంటున్నారు. జగన్ కూడా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని సూచిస్తున్నారు. అధికార పక్షం కూడా విపక్షాల మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా వారు లేవనెత్తే దాంట్లో ప్రజా సమస్యల కోణాన్ని మాత్రమే చూస్తూ పరిష్కారానికి పనిచేయాలని అంటున్నారు. గతంలో వారు అవమానించారని వీరు, వీరు అలా చేశారని వారు వ్యవహరిస్తే చట్ట సభల అందం అర్థం రెండూ ఇబ్బందులో పడతాయని అంటున్నారు. సో కొత్త ఏడాది లో అయినా జగన్ అసెంబ్లీకి రావాలని, చంద్రబాబు జగన్ పవన్ లోకేష్ సహా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ప్రజా సమస్యల మీద కూలంకషంగా చర్చించి మంచి పరిష్కారాలు అందించాలని అయిదు కోట్ల మంది ఏపీ ప్రజానీకం అయితే గట్టిగా కోరుకుంటున్నారు.



Tags:    

Similar News