గణతంత్రం ఘ‌న‌త‌.. అలా మొద‌లైంది!

Update: 2021-01-26 09:30 GMT
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు.. గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న ఆవిర్భవించిందని కూడా తెలుసు. కానీ.. ఈ తొలి వేడుక ఎలా జరిగింది? ఎవ‌రి ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది? అనే విష‌యాలు చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఆ వివ‌రాలు మీ కోసం...

భార‌త దేశం గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార‌డం అంటే.. ఈ రోజున రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చింది. దీని ప్రకారం.. భారత్ ప్రజాస్వామ్య, లౌకిక‌, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. కాగా.. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన గణతంత్ర దేశం మనది. ఈ దేశంలో పాలన భారత రాజ్యాంగం ప్రకారం సాగుతుంది. అంతటి ముఖ్యమైన రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఆమోదం లభించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. 1950 జనవరి 26న ఆయన 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా ఇదే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజును జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాం.

స్వాతంత్ర్య దినోత్స‌వానికి, గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి తేడా ఉంది. స్వాతంత్ర్య దినాన ప్ర‌భుత్వంలో ఉండే పాల‌కులు జెండా ఎగుర‌వేస్తారు. అంటే.. దేశంలో ప్ర‌ధాని, రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులు, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండాను ఎగ‌రేస్తారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉన్న‌వారు, అధికారులు జెండా ఆవిష్క‌రిస్తారు. అంటే.. దేశంలో రాష్ట్ర‌ప‌తి, రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు, జిల్లాల్లో క‌లెక్ట‌ర్లు ఈ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తారు.

ఇక‌, గణతంత్ర దినోత్సవ పరేడ్ నుంచి భారత రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. భారత సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ ఆయనే. ఈ పెరేడ్‌లో భారత సైన్యం తమ ట్యాంకులు, మిసైళ్లు, రాడార్, యుద్ధ విమానాల వంటి ఆయుధ సంప‌త్తిని ప్రదర్శిస్తుంది. గణతంత్ర దినోత్సవ పరేడ్ రాష్ట్రపతి భవనం నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ దగ్గర ముగుస్తుంది.

బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం రైజీనా హిల్స్‌లో రాష్ట్రపతి భవనం ముందు జరుగుతుంది. దానికి రాష్ట్రపతి ముఖ్య అతిథి. బీటింగ్ రిట్రీట్ వేడుకను గణతంత్ర దినోత్సవాల‌ ముగింపు కార్యక్రమంగా నిర్వ‌హిస్తారు. ఇది గణతంత్ర దినోత్సవం జరిగిన మూడో రోజున‌ అంటే.. జనవరి 29 సాయంత్రం నిర్వహిస్తారు. బీటింగ్ రిట్రీట్‌లో పదాతి దళం, వైమానిక దళం, నావికా దళాల బ్యాండ్ సంప్రదాయ సంగీతం వినిపిస్తూ మార్చ్ ఫాస్ట్‌ చేస్తాయి. ఇక‌, ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన‌ జాతీయ సాహస పురస్కారాల‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ అవార్డులను 1957 నుంచి ప్రారంభించారు. పురస్కారంలో భాగంగా ఒక పతకం, ధ్రువ పత్రం, నగదు బహుమతి అందిస్తారు. స్కూల్ విద్య పూర్తి చేసేవరకూ పిల్లలకు ఆర్థిక సాయం కూడా అందిస్తారు.
Tags:    

Similar News