లోకేష్ షాక్: సోషల్ మీడియాకు డిసిప్లిన్.. !
రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారం తరచుగా చర్చకు వస్తున్న విషయం తెలిసిందే.;
రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారం తరచుగా చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఇటు ప్రభుత్వాన్ని అటు అధికారంలో ఉన్న పార్టీల నాయకులను వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్ర స్థాయిలో దూషిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పోస్టులు కూడా చేస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలను కూడా ప్రచారం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం చర్చకు రావడం తర్వాత మళ్లీ కామన్ గా మారిపోవడం జరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాకు బాధితులు కాని రాజకీయ నాయకులు అంటూ ఎవరూ లేరనే చెప్పాలి. వైసీపీ నాయకులైనా టిడిపి అయినా జనసేన అయినా అందరూ సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో విమర్శలు ఎదుర్కొన్న వారే. తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడిన నాయకులే. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాకు మరింత బ్రేకులు వేస్తూ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో దూషణలు, అసభ్యకర పోస్టులు పెట్టకుండా నిలువరించేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు.
దీనిలో భాగంగానే సోషల్ మీడియాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరించాలని ఇటు పోలీసులకు అటు ఇతర విభాగాల సిబ్బందికి కూడా ఆయన ఆదేశించారు. దీనివల్ల సోషల్ మీడియాలో ఇప్పటివరకు వచ్చిన తీవ్రస్థాయి విమర్శలు వివాదాలు వంటివి తగ్గుతాయి అన్నది మంత్రి నారా లోకేష్ ఆలోచన. ఇటీవల కాలంలో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాకా అనేక విషయాల్లో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడిచింది.
అయితే ప్రజాస్వామ్య యుతంగా చర్చించటం.. సదుద్దేశంతో కూడిన విమర్శలు చేయటం వరకు తప్పు లేకపోయినప్పటికీ ఇష్టా రీతిగా ఎంత మాట పడితే అంత మాట వ్యాఖ్యానించటం ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం లాంటివి సమాజంలో తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. దీనిపైనే కొన్నాళ్ల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించే లాగా సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ ను నిలువరించాలని ఆయన కోరారు. దీనికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా దూకుడుకు కళ్లెం వేస్తూ తాజాగా తీసుకొన్న నిర్ణయం ఫలిస్తుందన్నది అధికార వర్గాలు చెబుతున్న మాట. తద్వారా ప్రజాస్వామ్య యుతంగా సోషల్ మీడియాకు ఒక డిసిప్లిన్ ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందనేది చూడాలి. కాగా, గతంలో వైసిపి ప్రభుత్వం కూడా కొంత మేరకు ఈ ప్రయత్నమే చేసినప్పటికీ అది ఫలించలేదు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు.. వివాదాలు రావడంతో పాటు వ్యక్తిగత విమర్శలు పెరిగాయి. సభ్యసమాజం సహించలేని మాటలు సైతం సోషల్ మీడియాలో దుమ్ము రేపాయి. దీనికి అడ్డుకట్ట వేయాలన్నదే నారా లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది.