ఏపీలో 'ఏఐ డాక్టర్' : చంద్రబాబు కీలక ప్రకటన
సాంకేతికంగా ఏపీని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ప్రాథమిక వైద్య రంగంలోనూ సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు.;
సాంకేతికంగా ఏపీని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ప్రాథమిక వైద్య రంగంలోనూ సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ప్రాథమిక వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణను ప్రకటించారు. త్వరలోనే ఏపీలో ఏఐ డాక్టర్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఏఐ డాక్టర్ ద్వారా రోగులకు ప్రాథమిక అంశాల్లో సందేహాలు, చికిత్స అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం.. నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ డాక్టర్ ద్వారా ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని తెలిపారు. సంజీవని ద్వారా ప్రజల హెల్త్ రికార్డులు అన్ని ఇక మొబైల్ ఫోన్లోకే వచ్చేలా చేస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటేనే అది హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీగా మారుతుందని చెప్పారు.
క్యాన్సర్ రోగులకు చికిత్స, పరిశోధన కోసం కర్నూలులో `స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్` ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. వార్షిక రాష్ట్ర బడ్జెట్ లో 6 శాతం నిధుల మొత్తాన్ని ఆరోగ్య రంగానికి వ్యయం చేసేలా రూ.19,300 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో పౌరులందరికీ ఉచితంగా రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించేలా ప్రణాళిక చేశామని వివరించారు. భీమా కంపెనీల ద్వారా రూ.2.5 లక్షల వరకు పేదా ధనిక తేడా లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదవారికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్న చంద్రబాబు.. రాష్ట్రంలో కొత్తగా సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ హెల్త్ రికార్డులు అన్నీ ఇక మొబైల్ ఫోన్లోకే వచ్చేలా చేస్తున్నామన్నారు. ``రాష్ట్రంలో రెండు పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఒకటి హెచ్‌పీవీ వ్యాక్సిన్..రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. దేశంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఉచితంగా వేసేలా ప్రధాని మోడీ కార్యక్రమం తీసుకువచ్చారు. చాలా మందికి క్యాన్సర్ వస్తోంది. 2021 నివేదిక ప్రకారం 29,379 మంది కాన్సర్ బాధితులు ఉన్నారు.`` అని చంద్రబాబు వివరించారు.