విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రద్దు.. ప్రయాణ చేంజ్ కు చార్జీలు లేవు..!
మరో ముఖ్యమైన విషయం.. ఈ ఉచిత టికెట్ రద్దు సదుపాయం కేవలం ఆయా విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా నేరుగా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే పరిమితం అవుతుంది.;
విమాన ప్రయాణికుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, వారి హక్కులను మరింత పటిష్టం చేసే దిశగా భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విమాన టికెట్ల రద్దు, రీఫండ్ ప్రక్రియలో తరచుగా ఎదురయ్యే ఇబ్బందులను, ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ‘48 గంటల ఉచిత రద్దు’ అనే సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు తమ ప్రయాణ ప్రణాళికలపై పూర్తి నియంత్రణ లభించడమే కాకుండా, విమానయాన సంస్థల పనితీరులో మరింత పారదర్శకత తీసుకువస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులు పొరపాటున తప్పుడు సమాచారంతో టికెట్ బుక్ చేసినా లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చినా, రద్దు ఛార్జీలు భారీగా చెల్లించాల్సి వచ్చేది. ఇక ఆ విధానానికి చరమగీతం పాడుతూ కొత్త విధానాలకు తీసుకువచ్చారు.
48 గంటలలో పు ఎలాంటి చార్జీలు లేవు..
ఈ కొత్త నిబంధన ప్రకారం.., ఒక ప్రయాణికుడు విమాన టికెట్ బుక్ చేసుకున్న సమయం నుంచి 48 గంటల లోపు రద్దు చేసుకుంటే ఎలాంటి రుసుము లేకుండా టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు లేదంటే మార్పులు చేసుకోవచ్చు. ఈ సదుపాయం అందరికీ అన్ని వేళలా వర్తించదు.. దీనికి కొన్ని పరిమితులు విధించారు. ముఖ్యంగా ప్రయాణ తేదీకి, బుకింగ్ తేదీకి మధ్య నియమిత సమయం ఉండాలి. దేశీయ విమాన ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పొందాలంటే, వారు ప్రయాణించాల్సిన తేదీకి కనీసం వారం ముందే టికెట్ బుక్ చేసి ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాల విషయానికి వస్తే, ప్రయాణ తేదీకి కనీసం 15 రోజుల ముందు బుకింగ్ చేసుకున్న వారికే ఈ అవకాశం కల్పిస్తారు. అంటే, ప్రయాణానికి మరీ దగ్గరగా టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ నిబంధన వర్తించదని ప్రయాణికులు గమనించాలి.
అధికారిక వెబ్ సైట్ల నుంచే..
మరో ముఖ్యమైన విషయం.. ఈ ఉచిత టికెట్ రద్దు సదుపాయం కేవలం ఆయా విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా నేరుగా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న థర్డ్ పార్టీ ట్రావెల్ యాప్‌లు లేదా ఇతర పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ ప్రయాణికుడు నిర్ణీత 48 గంటల వ్యవధిలో కేవలం ప్రయాణ తేదీ మార్చుకోవాలనుకుంటే, ఎటువంటి జరిమానా ఉండదు కానీ, పాత టికెట్ ధరకు, కొత్త తేదీలో ఉన్న టికెట్ ధరకు మధ్య ఏదైనా వ్యత్యాసం (Fare Difference) ఉంటే దానిని ప్రయాణికుడే భరించాల్సి ఉంటుంది.
రద్దు చేసుకుంటే సొమ్మును కోరుకున్న విధంగా..
రీఫండ్ ప్రక్రియలో కూడా DGCA కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో విమానయాన సంస్థలు రద్దు చేసిన టికెట్ సొమ్మును ‘క్రెడిట్ షెల్’ రూపంలో తమ వద్దే ఉంచుకొని, భవిష్యత్తు ప్రయాణాలకు వాడుకోమని ప్రయాణికులపై ఒత్తిడి తెచ్చేవి. కానీ కొత్త నిబంధన ప్రకారం.., రీఫండ్ మొత్తాన్ని ఏ రూపంలో తీసుకోవాలో నిర్ణయించే పూర్తి అధికారం ప్రయాణికుడికే ఉంటుంది. వారు కోరుకుంటే టికెట్ కొనుగోలు చేసిన అసలు పేమెంట్ విధానం (బ్యాంక్ ఖాతా లేదా కార్డు) ద్వారానే నగదును తిరిగి పొందవచ్చు. విమానయాన సంస్థలు తమ ఇష్టానుసారంగా నిధులను క్రెడిట్ షెల్‌గా మార్చడానికి వీల్లేదు. ఈ విప్లవాత్మకమైన నిబంధన మార్చి 26, 2026 నుంచి అమలులోకి రానుంది, ఇది భారత విమానయాన రంగంలో వినియోగదారుల హక్కులకు సరికొత్త భరోసాను ఇవ్వనుంది.