అమెరికా ఆయుధంతో పాక్ క‌న్ను పొడిచిన తాలిబ‌న్!

ఇందులో బ‌లాబ‌లాల రీత్యా అఫ్ఘాన్ తేలిపోతుంద‌ని భావించినా, పాక్ ను అనూహ్యంగా దెబ్బ‌కొడుతోంది.;

Update: 2026-02-28 11:29 GMT

అఫ్గానిస్థాన్ అంటే.. ఎంతో చ‌రిత్ర ఉన్న దేశం. స‌రిగ్గా 500 ఏళ్ల కింద‌ట‌.. 1526లోనే మొఘ‌ల్ రాజు బాబ‌ర్.. భార‌త్ పైకి దండెత్తాడు. అలాంటి అఫ్ఘానిస్థాన్ ఇప్పుడు తీవ్ర‌మైన పేద‌రికం, క‌నీసం రోడ్లు కూడా లేని దుర్భ‌ర ప‌రిస్థితుల్లో ఉంది. గ‌త 50 ఏళ్ల చ‌రిత్ర చూసినా.. తొలుత సోవియ‌ట్ యూనియ‌న్ (యూఎస్ఎస్ఆర్), త‌ర్వాత అమెరికా దాడుల‌తో అఫ్ఘాన్ అత‌లాకుత‌లం అయింది. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం ఈ దేశాన్ని ర‌ష్యా, అమెరికా పావులా వాడుకున్నాయి. అమెరికా కీలు బొమ్మ ప్ర‌యోగం విఫ‌ల‌మ‌య్యాక అఫ్ఘాన్ ఐదేళ్లుగా తాలిబ‌న్ల పాల‌న‌లో ఉంది. కానీ, క‌నీస వ‌స‌తులు మాత్రం క‌రువే. ఉదాహ‌ర‌ణ‌కు క్రికెట్ లో వారి దేశం అంత‌ర్జాతీయ స్థాయిలో చాలా మెరుగ్గా ఆడుతున్నప్ప‌టికీ ఆ దేశంలో ఇప్ప‌టికీ క‌నీసం ఒక్క అంత‌ర్జాతీయ స్టేడియం కూడా లేదు. మ‌రోవైపు తాలిబ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక పాకిస్థాన్ తో తీవ్రంగా విభేదిస్తోంది. ఈ రెండు దేశాలు యుద్ధం దిశ‌గా చాలా ద‌గ్గ‌ర‌గా కూడా వెళ్లాయి. తాజాగా మ‌రోసారి యుద్ధంలో త‌ల‌ప‌డుతున్నాయి. ఇందులో బ‌లాబ‌లాల రీత్యా అఫ్ఘాన్ తేలిపోతుంద‌ని భావించినా, పాక్ ను అనూహ్యంగా దెబ్బ‌కొడుతోంది.

ఎయిర్ ఫోర్స్ లేదు..

మిలిటెంట్ కార్య‌క‌లాపాల రీత్యా తాలిబ‌న్ల‌కు తుపాకుల బ‌లం ఉన్నా.. వారికి బ‌ల‌మైన సైన్యం, ఎయిర్ ఫోర్స్ లేదు. ఎలాగూ లాండ్ లాక్ డ్ (భూ ప‌రివేష్ఠిత‌) దేశం కాబ‌ట్టి నేవీ (నౌకా ద‌ళం) ఉండ‌దు. ఇక అత్యంత కీల‌క‌మైన ఎయిర్ ఫోర్స్ అనేది లేదు. ఈ రోజుల్లో ఇది ఆశ్చ‌ర్య‌క‌ర‌మే అయినా.. వాస్త‌వం. అయితే, శుక్ర‌వారం మొద‌లైన యుద్ధంలో స‌రిహ‌ద్దు నుంచి 200 కిలోమీట‌ర్ల దూరంలోని పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్ పై తాలిబ‌న్లు వైమానిక దాడులు చేశారు. ఇది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అమెరికా వ‌దిలివెళ్లిన‌వాటితో..

2001లో త‌మ దేశంపై వైమానిక దాడుల అనంత‌రం అమెరికా.. ఆల్ ఖైదా వ్య‌వ‌స్థాప‌కుడు బిన్ లాడెన్ ను చంపేందుకు అఫ్గాన్ మీద దాడుల‌కు దిగింది. అమెరికా, నాటో కూట‌మి సైన్యం ద‌శాబ్దాల పాటు అక్క‌డే తిష్ఠ వేశాయి. చివ‌ర‌గా 2021లో అఫ్ఘాన్ ను వీడి వెళ్లింది అమెరికా. అనంత‌రం తాలిబ‌న్లు పుంజుకుని దేశాన్ని త‌మ గుప్పిట ప‌ట్టారు. తాజాగా పాకిస్థాన్ పై దాడుల్లో అమెరికా ఐదేళ్ల కింద‌ట వ‌దిలి వెళ్లిన అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాల‌జీని ఉప‌యోగించింది. నిఘా, దాడుల‌కు ఉప‌యోగించే యూఏవీలతో పాక్ ఎయిర్ డిఫెన్స్ ను త‌ప్పించుకుంది. క‌చ్చిమైన నిఘాతో పాక్ పై డ్రోన్ దాడుల‌కు దిగింది.

గురువారం రాత్రి మొద‌లై...

పాక్-అఫ్ఘాన్ మ‌ధ్య కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. ఈ నెల 22న పాక్ సైన్యం అఫ్ఘాన్ తో ఉన్న స‌రిహ‌ద్దులో వైమానిక దాడులు చేసింది. దీనికి ప్ర‌తీకారంగా అఫ్ఘాన్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ ఉద్రిక్త‌త‌లు తాజాగా యుద్ధంగా మారాయి. గురువారం రాత్రి మొద‌లైన దాడులు భీక‌రంగా మారాయి. 270 మంది తాలిబ‌న్ల‌ను హ‌త‌మార్చామ‌ని పాక్ ప్ర‌క‌టించింది. 55 మంది పాక్ సైనికుల‌ను చంపిన‌ట్లు అఫ్ఘాన్ తెలిపింది.

Tags:    

Similar News