అన్నంత పనిచేశాడు.. వెనెజువెలా చమురుపై ట్రంప్ కన్ను..
వెనెజువెలా నుంచి సుమారు 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల అత్యంత నాణ్యమైన చమురును అమెరికాకు అప్పగించేందుకు అక్కడి తాత్కాలిక యంత్రాంగం సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు.;
ట్రంప్ అన్నంత పని చేశాడు. వెనిజువెల నుంచి డ్రగ్స్ అమెరికాకు వస్తున్నాయంటూ ప్లాన్ ప్రకారం దాడి చేసి అధ్యక్షుడిని అపహరించి వెనిజువెలలో తన మాట నెగ్గేలా చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడి చమురుపై కన్నేసి మొత్తం అమెరికాకు తరలించేసి సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. చూస్తుంటే ట్రంప్ వెనిజువెలను ఆక్రమించి ఆ దేశ ప్రజల కోసం కాదు.. కేవలం చమురు సంపద కోసమేనని అర్థమవుతోంది.
అంతర్జాతీయ ఇంధన రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్న ట్రంప్.. ఆ దేశం నుంచి భారీగా చమురును అమెరికాకు తరలించనున్నట్లు ప్రకటించారు.
ట్రూత్ సోషల్ వేదికగా కీలక ప్రకటన
వెనెజువెలా నుంచి సుమారు 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల అత్యంత నాణ్యమైన చమురును అమెరికాకు అప్పగించేందుకు అక్కడి తాత్కాలిక యంత్రాంగం సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ఈ చమురును అంతర్జాతీయ మార్కెట్ ధరలకే విక్రయిస్తామని.. అయితే ఆ విక్రయాల ద్వారా వచ్చే నిధులు మాత్రం తన నేరుగా తన నియంత్రణలోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. "వెనెజువెలా నుంచి వచ్చే ఈ ఆదాయాన్ని అమెరికా, వెనెజువెలా ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగిస్తాం. ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఇంధన శాఖను ఆదేశించాం" అని ట్రంప్ పేర్కొన్నారు.
మదురో అరెస్ట్ తర్వాత వేగంగా మారిన సమీకరణాలు
వెనెజువెలా అధ్యక్షుడు నికలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం వెనెజువెలాలో ఉన్న తాత్కాలిక అధికారులు ఈ చమురు బదలాయింపునకు అంగీకరించినట్లు సమాచారం. నౌకల ద్వారా ఈ చమురును నేరుగా అమెరికా ఓడరేవులకు తరలించే ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
వైట్‌హౌస్‌లో చమురు దిగ్గజాల భేటీ
ఈ చమురు నిల్వల నిర్వహణ, భవిష్యత్ పెట్టుబడులపై చర్చించేందుకు ట్రంప్ వైట్‌హౌస్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ప్రపంచ ప్రఖ్యాత చమురు కంపెనీలైన ఈక్సోమొబైల్, చెవ్ రోన్, కోన్ కో ఫిలిప్స్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వెనెజువెలా ఇంధన రంగంలో అమెరికా కంపెనీల పునరాగమనంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గెలవకపోతే అభిశంసనే.. సొంత పార్టీకి ట్రంప్ హెచ్చరిక
ఇటు అంతర్జాతీయ వ్యవహారాల్లో దూకుడు ప్రదర్శిస్తూనే అటు దేశీయంగా తన సొంత పార్టీ రిపబ్లికన్ల నేతలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోతే డెమోక్రాట్లు తనను మళ్లీ అభిశంసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పనితీరుపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని అందరూ ఐక్యంగా పోరాడి గెలవాలని పిలుపునిచ్చారు.
వెనెజువెలా చమురు సంపదను తన నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా అటు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఇటు రాజకీయంగా తన పట్టును నిరూపించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ప్రపంచ చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.