నేత‌ల పాట్లు: ఒకప్పుడు బిజీ.. ఇప్పుడు ఖాళీ.. !

రాష్ట్రంలో కొందరు నాయకులు ఒకప్పుడు బిజీగా ఉంటే ఇప్పుడు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నారు.;

Update: 2026-01-07 17:30 GMT

రాష్ట్రంలో కొందరు నాయకులు ఒకప్పుడు బిజీగా ఉంటే ఇప్పుడు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నారు. వీరిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు కూడా ఉండడం విశేషం. దీంతో వారంతా తమకు ఏదైనా పని చెప్పండి చేస్తాం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల మధ్య ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ఇప్పటికే పెద్ద పని అప్పగించింది.

కానీ ఆ పని చేయటం మానేసి కొంతమంది నేతలు వ్యక్తిగత పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో ప్రధానంగా కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఒకప్పుడు కాంట్రాక్టు ప‌నుల‌తో బిజీగా ఉన్న నాయకులు గత ఏడాది కాలంలో ఖాళీగా కనిపిస్తున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు చేతినిండా పని ఉంటుందని భావించినప్పటికీ రాష్ట్రంలో కొద్దిపాటి పనులు మాత్రమే జరుగుతున్నాయి.

పైగా రహదారుల నిర్మాణం జరుగుతున్నప్పటికీ గతంలో వీటిని తీసుకున్న కాంట్రాక్టర్లకు మాత్రమే వాటిని తిరిగి అప్పగించారు. ఇక పిపిపి విధానంలో పనులు చేపట్టాలని భావించినప్పటికీ ఈ విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచన చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న రాజకీయ విమర్శలు నేపథ్యంలో పిపిపి పై ఆలోచనలు పడినట్టు తెలుస్తోంది. దీంతో నేతలు ఏదైనా పని ద‌క్కుతుందని భావించినప్పటికీ ఇటీవల కాలంలో పనులు దక్కక ఖాళీగా కనిపిస్తున్నారు.

మరోవైపు అంతర్గతంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నాయకులు కూడా ఉన్నారన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరో ఏడాది వరకు కూడా కొన‌సాగ‌నున్నాయి. భారీ స్థాయిలో పనులు అప్పగించే అవకాశం అయితే కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విషయంలో ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పదేపదే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు పెట్టుకుని కేంద్రానికి విన్నవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులను దక్కించుకోవాలని భావిస్తున్న నేతలు ఒకప్పుడు బిజీగా ఉండి పనుల్లో తీరిక లేకుండా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నారు. ఇది కూడా ఒకరకంగా పార్టీలో భేదాభిప్రాయాలకు కారణంగా మారింది. ఖాళీగా ఉన్న నాయకులు నియోజకవర్గంలో రాజకీయంగా దూకుడు వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యేలకు నేతలకు మధ్య గ్యాప్ అయితే పెరుగుతోంది.

మొత్తంగా చూస్తే ఒకప్పుడు బిజీగా ఉన్న నాయకులు ఇప్పుడు ఖాళీగా ఉండడంతో అటు ప్రభుత్వ కార్యక్రమాలకు ఇటు సొంత పనులకు కూడా దూరమయేటటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు పనులు అప్పగించాలని ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఇప్పటికే ఉన్న కాంట్రాక్టర్లు నిధుల సమస్య వంటివి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి అన్నది వాస్తవం.

Tags:    

Similar News