సెక్యూరిటీని కొడుతున్నారు.. : రేవంత్‌రెడ్డి పై కేటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన.. పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రెస్టేషన్ పెరిగిపోయిందని.. ఎందుకు అరుస్తున్నాడో .. తెలియదు.. ఇంటా బయటా కూడా అరుపులు కేకలతో పెడబొబ్బలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి సీటు తెచ్చుకున్నారని అన్న కేటీఆర్.. ఆ సీటులో కూర్చుని చక్కగా పాలన చేసుకోవచ్చు కదా.. కానీ.. ఆయన అరుపులు పెడబొబ్బలు పెడుతున్నాడని అన్నారు. ఇటీవల కాలంలో ఆయన పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. తన చుట్టూ ఉండే సెక్యూరిటీని కూడా కొడుతున్నారని దీంతో వారు గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు. ఇప్పుడు కొడుతున్నాడు.. రేపు కరుస్తాడేమో.. అని ఆందోళనగా ఉందన్నారు.
''అందుకే సీఎం భార్య గీతమ్మకు ఒకటే చెబుతున్నా.. కాస్త జాగ్రత్తగా చూసూకోమ్మా. ఇప్పుడు కొడుతున్నాడు.. రేపు కరుస్తాడేమో.. ''అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక, తాను గుంటూరులో చదువుకున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపైనా సెటైర్లు పేల్చారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరులో చదువుకున్న మాట వాస్తవమేనని అన్నారు. కానీ, నీలాగా ఆవారాగాడిలా.. మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. ''నేను గుంటూరుకు పోయి చదువుకుంటే తప్పు.. నువ్వు భీమవరం కెల్లి అల్లుడిని తెచ్చుకుంటే తప్పులేదా?'' అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చాక రెండులక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని.. ఆ ఉద్యోగాల మాటేంటని అడిగితే.. మాత్రం నోరేసుకుని పడుతున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేస్తే. అది కేసీఆర్‌కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తొందరలోనే పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్ పై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.