ఎవరీ సువేందు.. బెంగాల్ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఎంత?

Update: 2020-12-20 06:00 GMT
దేశ ప్రజల్లో ఆసక్తికకరంగా మారింది బెంగాల్ రాజకీయం. మరికొద్ది నెలల్లో ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు భవిష్యత్తు రాజకీయాల్ని డిసైడ్ చేయటమే కాదు.. దేశంలో బీజేపీ ఎదుగుదలకు ఒక ల్యాండ్ మార్కుగా మారుతుంది. అదే సమయంలో.. కమ్యునిస్టు కోటను ఇంతకాలం తన అడ్డాగా చేసుకొని తిరుగులేని అధినేత్రిగా సాగిన మమతా బెనర్జీ అధిపత్యం ఏం కానుంది? అన్నది అసలు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సువేందు అధికారి ఎవరు? ఆయన బలం ఎంత? బెంగాల్ రాజకీయాల్లో ఆయన చూపించే ప్రభావం ఎంత? సదీర్ఘకాలం దీదీ పార్టీలో ఉన్న ఆయన బీజేపీలో ఎందుకు చేరారు? ఆయన రాకతో కమలనాథులకు కలిగే లాభమెంత? దీదీకి జరిగే నష్టమెంత? ఆయన రాక రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఏ మేరకు మేలు జరిగే వీలుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా శాఖామంత్రిగా.. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు సువేందు అధికారి. 2009.. 2014 రెండు దఫాలు ఎంపీగా వ్యవహరించిన ఆయన.. గత ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచి.. నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007లో నందిగ్రామ్ ఉద్యమాన్ని నడిపించింది అధికారి కుటుంబమే. వాస్తవానికి బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని అధిక్యత ప్రదర్శించిన కమ్యునిస్టుల ప్రభుత్వం కుప్పకూలటానికి.. దీదీ పాగా వేయటానికి కారణం నందిగ్రామ్ ఉద్యమమేనని చెప్పక తప్పదు.

సీపీఎంకు కంచుకోటగా ఉన్న జంగల్ మహల్ ప్రాంతానని దీదీ పార్టీ వైపు తిప్పటంలో అధికారి కుటుంబం కీలక భూమిక పోషించింది. మిడ్నాపూర్ జిల్లాకు చెందిన ఆయన.. పలు ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపించే సత్తా ఉంది. జంగల్ మహల్ ప్రాంతంలో దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో ఆయన కుటుంబానికి మంచి పట్టుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. అంటే..మొత్తం అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 12 శాతం స్థానాలపై ఆయన తన ప్రభావాన్ని చూపగలరు.

సువేందు తాజాగా బీజేపీలో చేరటం దీదీ పార్టీకి దారుణంగా దెబ్బ తీస్తుందని చెప్పాలి. ఎందుకంటే.. ఆయనకు పట్టున్న 40 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీకి బలమైన నాయకత్వం లభించే అవకాశం లేదు. అంటే.. ఈ 40 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయం. ఈసారి జరిగే ఎన్నికల్లో గెలుపొందటం ద్వారా.. హ్యాట్రిక్ కొట్టాలన్న దీదీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నే. బలమైన నేతగా పేరున్న సువేందు తాజాగా బీజేపీతో చేరారు. ఆయనత పాటు మరో 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఒక ఎంపీ.. మరో మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. తాజాగా పార్టీలోకి చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు టీఎంసీకి చెందిన వారే కావటం గమనార్హం.

ఇంతకూ ఆయన పార్టీ మారాలన్న ఆలోచన ఎందుకు చేశారన్న విషయంలోకి వెళితే.. మమత మేనల్లుడు అభిషేక్ బెన్జీ అధిపత్యం నచ్చకపోవటంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. నవంబరు 27న తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. సీఎం మమతకు గవర్నర్ ధస్కర్ కు తన రాజీనామా లేఖల్ని పంపారు. దీనికి కాస్త ముందుగా హుగ్లీ రివర్ బ్రిడ్జి కమిషన్ కు ఛైర్మన్ గా వ్యవహరించిన ఆయన.. ఆ పదవికి సైతం రాజీనామా చేశారు. మొత్తంగా చూస్తే.. సువేందును బీజేపీ గూటికి చేర్చటం ద్వారా దీదీకి బలమైన సవాలును కమలనాథులు విసిరారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News