ఈ యూటర్న్ లో ఎంతవరకు వెళ్లనున్నాయి కేసీఆర్?

Update: 2021-01-01 11:30 GMT
ఎవరెన్ని చెప్పినా సరే.. ఒప్పుకునేదే లేదు. కొత్త నిర్ణయాలతో ఇబ్బందులు ఉంటాయి. కానీ.. అవన్నీ అమలు కావాల్సిందే. వెనక్కి తగ్గేది లేదంటూ కరాఖండిగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిరోజుల నుంచి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తన తీరుకు భిన్నంగా ఆయన అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. దాదాపు వంద రోజులకు పైనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను నిలిపి వేసిన ముఖ్యమంత్రి.. ఏది ఏమైనా కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలన్న పట్టును ప్రదర్శించారు. తన నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఒత్తిళ్లు వచ్చినా ఒప్పుకోని ఆయన.. ఒక సందర్భంలో ఎవరి మాటా వినడు సీతయ్ంయ మాదిరి కనిపించారు.

అలాంటి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఢిల్లీ వచ్చిన తర్వాత నుంచి ఆయన తన తీరును పూర్తిగా మార్చేశారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వడివడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు తనను వేలెత్తి చేూపించే అవకాశం ఉన్న విషయాల మీద ఆయన వెనక్కి తగ్గారు. అదే విషయాల మీద గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన స్టాండ్ తీసుకోవటం గమనార్హం. నియంత్రిత సాగు విధానంలో భాగంగా ప్రభుత్వం చెప్పిన పంటల్నే వేయాలని చెప్పిన కేసీఆర్ మాటపై రైతులు పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తే తగ్గేది లేదన్న ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి ససేమిరా అన్నారు. కానీ.. తాజాగా మాత్రం ఎవరికి నచ్చిన పంట వారు వేసుకోవచ్చని చెప్పేశారు.

ఇలాంటివి చాలానే అంశాలు ఉన్నాయి. అయితే.. కేసీఆర్ ఈ తరహా మార్పుకు కారణం గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఒకటైతే.. మరి ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయి వచ్చిన తర్వాత నుంచి ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. తాను తీసుకున్న సంచలన నిర్ణయాలపై వెనక్కి తగ్గుతూ వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ఎవరి మాటా వినని సీతయ్య కాస్తా.. యూటర్న్ ముఖ్యమంత్రిగా పలువురు అభివర్ణిస్తున్నారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతులకు మద్దతు ఇవ్వటమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా బంద్ ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించిన కేసీఆర్.. అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోవటం చూస్తే.. ఇలాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమేమో అన్న భావన కలుగక మానదు.

ఇటీవల కాలంలో కేసీఆర్ వెనక్కి తగ్గిన అంశాల్ని చూస్తే చిట్టా పెద్దదిగానే కనిపిస్తుంది. అవేమంటే..

- సాగు చట్టాల అమలుకు తెలంగాణ రాష్ట్రం సానుకూలం (గతంలో తీవ్రంగా వ్యతిరేకించారు)

- కేంద్రం తీసుకొచ్చి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం (గతంలో ఆయుష్మాన్ భారత్ కంటే తాము అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ వంద రెట్లు మెరుగైందని రాష్ట్ర అసెంబ్లీలోనే సగర్వంగా చెప్పుకున్నారు)

- వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పాత విధానంలోనే (కొత్త విధానం కోసం ఏకండా వందకు పైగా రోజులు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు)

- నియంత్రిత సాగు విధానం నుంచి బయటకు వచ్చేశాం.. ఎవరికి నచ్చిన పంట వారు వేసుకోవచ్చు (గతంలో ప్రభుత్వం చెప్పిన పంటనే వేసుకోవాలి. అందుకు భిన్నంగా వేస్తే.. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయదు)

- ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గటం (ఎల్ఆర్ఎస్ విధానంలో గతంలో ఉన్న విధానాన్ని పాటించటం)
Tags:    

Similar News