ఇంటా.. బయటా.. సవాలే! భారతీయ వలసల 'అంపశయ్య' ఆట

రాజకీయ నాయకులు ఈ పరిస్థితిలో చలి కాచుకుంటూ విదేశీ ఉద్యోగార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట భవిష్యత్తు లేదు.. రచ్చ నిలవలేని పరిస్థితి ప్రవాస భారతీయులకు నెలకొంది.;

Update: 2025-12-28 12:30 GMT

ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి.. దేశంలో తమ టాలెంట్ కు తగ్గ జాబులు లేవని వలసల బాట పడుతున్నారు మన భారతీయులు.. పోనీ విదేశాల్లో నిరూపించుకుందామంటే ఇప్పుడు వలసవాదులు ఎక్కువైపోయి ఆయా దేశాల్లోనే అసమ్మతి మొదలైంది. విదేశీయులు వద్దంటూ అమెరికా, యూరప్, కెనడాలాంటి దేశాల్లో ఆందోళనలు మొదలవుతున్నాయి. రాజకీయ నాయకులు ఈ పరిస్థితిలో చలి కాచుకుంటూ విదేశీ ఉద్యోగార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట భవిష్యత్తు లేదు.. రచ్చ నిలవలేని పరిస్థితి ప్రవాస భారతీయులకు నెలకొంది.

నిజంగానే ఇప్పుడు భారతదేశం నేడు ఒక వింతైన సామాజిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు దేశం ఆర్థికంగా దూసుకుపోతోందని గణాంకాలు చెబుతుంటే.. మరోవైపు లక్షలాది మంది మేధావులు, యువత దేశాన్ని వీడి పరాయి గడ్డపై పౌరసత్వం కోసం క్యూ కడుతున్నారు. మరికొందరు ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లి, అక్కడి నిబంధనలకు బలై 'డిపోర్ట్' అవుతూ వెనుతిరుగుతున్నారు. ఈ రెండు విరుద్ధ ధోరణులు ఒకే ప్రశ్నను సంధిస్తున్నాయి. భారతీయుడికి ఇంటా భవిష్యత్తు లేదా? బయట భద్రత లేదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

స్వదేశీ త్యాగం.. పౌరసత్వం ఎందుకు వదులుకుంటున్నారు?

ఏటా దాదాపు 2 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడం చిన్న విషయం కాదు. ఇది కేవలం దేశం మీద ప్రేమ లేక కాదు.. మెరుగైన జీవితం కోసం చేసే ఒక అనివార్యమైన త్యాగం. అభివృద్ధి చెందిన దేశాల్లో గాలి, నీరు, ట్రాఫిక్ వంటి కనీస సౌకర్యాల నుండి సామాజిక భద్రత వరకు అన్నీ ఒక క్రమపద్ధతిలో ఉండటం ప్రధాన ఆకర్షణ. పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య, ఖరీదు లేని ప్రభుత్వ వైద్యం దొరికే దేశాల వైపు మధ్యతరగతి చూపు మళ్లుతోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం, డాలర్లు లేదా పౌండ్లలో ఆదాయం, రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఆసరా వంటివి భారతీయులను పరాయి గడ్డకు శాశ్వత బానిసలను చేస్తున్నాయి.

విదేశీ బహిష్కరణ.. డిపోర్టేషన్ల వెనుక దాగిన చేదు నిజం

ఒకవైపు పౌరసత్వాలు పెరుగుతుంటే.. మరోవైపు ఈ ఏడాది దాదాపు 24,600 మంది భారతీయులు వివిధ దేశాల నుండి వెనక్కి పంపబడ్డారు. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎలాగైనా విదేశీ గడ్డపై అడుగు పెట్టాలనే ఆత్రుతతో ఏజెంట్లను నమ్మి అక్రమంగా సరిహద్దులు దాటుతూ పట్టుబడుతున్నారు.స్టూడెంట్ వీసాపై వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాల పరిమితి మించడం, లేదా విజిటర్ వీసాపై వెళ్లి పనుల్లో చేరడం వంటి కారణాలు డిపోర్టేషన్‌కు దారితీస్తున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా స్థానిక దేశాలు తమ పౌరులకే ప్రాధాన్యతనిస్తూ, వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నాయి.

భారతీయుల ఆశలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. కానీ ప్రపంచ దేశాల తలుపులు మాత్రం ఇరుకవుతున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఎర్రటి కార్పెట్ పరిచిన దేశాలు.. నేడు అడుగడుగునా నిబంధనల గోడలు కడుతున్నాయి. అంటే.. భారతీయుడికి ఇటు స్వదేశంలో సరైన గుర్తింపు ఉపాధి దొరకక.. అటు విదేశాల్లో చట్టబద్ధమైన రక్షణ లేక 'అంపశయ్య'పై ఉన్నట్లుగా సతమతమవుతున్నాడు.

దీన్ని బట్టి చూస్తే.. వలస అనేది ఒక 'అవకాశం'గా ఉండాలి తప్ప.. అనివార్యత కాకూడదు. దేశంలోనే గౌరవప్రదమైన జీవితం, భవిష్యత్తుపై నమ్మకం కలిగినప్పుడు.. భారతీయుడు పౌరసత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహించడం ద్వారా విదేశాల్లో భారతీయుల గౌరవాన్ని కాపాడుకోవచ్చు.

Tags:    

Similar News