వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Update: 2020-10-15 06:00 GMT
వాన అంటే అలాంటి ఇలాంటి వానకాదు. చూసినోళ్లు మాత్రమే దాని తీవ్రత తెలుస్తుంది. ఇప్పటివరకువర్షాల పడటం.. ఆ సందర్భంగా కొన్ని ఇబ్బందులు.. చిక్కులు ఎదురుకావటం తెలిసిందే. భారీ వర్షాలు కురిసినప్పడు వాహనాలు కొట్టుకుపోవటం చూస్తుంటాం. వరద నీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కార్లు.. లారీలు.. బస్సులు లాంటివి కొట్టుకెళ్లిన ఉదంతాలు విని ఉంటాం.

కానీ.. అందుకు భిన్నంగా తాజాగా కురిసిన భారీ వర్షాలకు ఇల్లే కొట్టుకుపోయిన వైనం ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలకు షాకింగ్ గా మారింది. సికింద్రాబాద్ బౌద్ధనగర్ అంబర్ నగర్ లోని నాలా పక్కనే ఒక ఇల్లు ఉంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంతో వెల్లువెత్తిన వరద నీటి తీవ్రతకు ఏకంగా ఒక ఇల్లు కొట్టుకుపోయిన వైనం నమ్మశక్యం కానిదిగా మారింది.

69 గజాల్లో మూడు గదులు నిర్మించుకున్న ఈ ఇంట్లో నలుగురు (భార్య..భర్త.. ఇద్దరు పిల్లలు) నివసిస్తుంటారు. మంగళవారం అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో వరద పోటెత్తింది. వర్షపు నీటికి ఇల్లు బాగా నాని ఉండటంతో..ముప్పును గ్రహించిన కుటుంబం.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో జాగ్రత్తగా ఉన్నారు.ఒక్కసారి ఎగిసిపడిన వరద తీవ్రతకు ఇల్లు కొట్టుకుపోయింది.

ముందు రోజు వరకు ఉన్న ఇల్లు.. తెల్లారేసరికి మాయం కావటంతో కాలనీ వాసులు షాక్ కు గురయ్యారు. ఇంటితో పాటు.. బైకు.. వాషింగ్ మెషీర్.. ఇంట్లో సామాన్లతో పాటు.. నగదు.. బంగారు ఆభరణాలు.. కీలకమైన డాక్యుమెంట్లు మొత్తం నీటిపాలైనట్లుగా సదరు యజమాని చెబుతున్నారు. వర్షం కారణంగా.. ఇల్లే కొట్టుకుపోయిన వైనం ఇప్పుడే వింటున్నాం.. చూస్తున్నామని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News