తప్పులో కాలేసిన మీడియా.. ఇంట్లోకి తొంగి చూసే చిరుత ఫేక్

Update: 2020-06-09 06:50 GMT
అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్న సామెతకు తగ్గట్లే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా సంచలనం చోటు చేసుకుందంటే.. వ్యక్తిగతంగా వెళ్లి.. దాన్ని చెక్ చేసుకు వచ్చిన తర్వాతే మీడియాలో కన్ఫర్మ్ చేసేవారు. కాలం మారింది. ఎప్పటికప్పుడు సంచలన అంశాల్ని బ్రేకింగ్ రూపంలో వేసేయాలి. ఆ హడావుడిలో దొర్లుతున్న తప్పులు అన్ని ఇన్ని కావు.

ఈ తొందరలోనే ప్రముఖుల్ని పలుమార్లు వార్తల్లో చంపేసిన మీడియా.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తోంది. ఎప్పుడో.. ఎక్కడో జరిగిన విషయాన్ని.. మన దగ్గరే జరిగినట్లుగా వార్తలు వేయటంఅలవాటుగా మారింది. ఎందుకీ తప్పులు జరుగుతాయంటే.. సదరు యాజమాన్యాల పాలసీగా చెప్పాలి. అందరి కంటే ముందు ఉండాలన్న తపన మంచిదే కానీ.. ముందు వెనుకా చూసుకోకుండా పరుగులు zతీసే ధోరణితో ఇలాంటి దరిద్రాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ మధ్యన రాజేంద్ర నగర్ పరిధిలో రోడ్డు మీద ఉన్న చిరుత.. తర్వాత వెళ్లిపోవటం.. తర్వాత కొన్నిచోట్ల దాని ఆనవాళ్లుకనిపించటం తెలిసిందే. ఈ రోజు (మంగళవారం) ఉదయం రాజేంద్రనగర్ లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లోకి చిరుత వచ్చినట్లుగా చెబుతున్నారు. నారం ఫాం హౌస్ లోని ఒక ఇంటి వద్ద చిరుత కిటికీ లోపలకు తొంగి చూస్తున్నట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది.

అయితే.. అది నారం ఫాంహౌస్ కాదని.. వేరే చోటుగా చెబుతున్నారు. ఎప్పటిదో పాత వీడియోను సరికొత్తగా ఎవరో అవగాహన లేమితో పోస్టు చేయటం.. అది అప్పటికప్పుడు వైరల్ గా మారటమే కాదు.. వర్సిటీలోకి చిరుత వచ్చేసిందన్న వార్త టెలికాస్ట్ అయ్యే వరకూ వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ వీడియో కరెక్టు కాదని.. తప్పడుదని చెప్పినా తమ మాట వినటం లేదని అధికారులు వాపోవటం గమనార్హం. అందివచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని ఎవరినైనా భయపెట్టే రోజులు వచ్చేశాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News