చంపి శవాలు మాయం చేస్తా...అనంతమైన బెదిరింపు

బెదిరించాలంటే కూడా చాలానే దుస్సాహసం ఉండాలి. తెగింపు కంటే బరిదెగింపు ఉండాలి.;

Update: 2026-04-26 11:22 GMT

బెదిరించాలంటే కూడా చాలానే దుస్సాహసం ఉండాలి. తెగింపు కంటే బరిదెగింపు ఉండాలి. అయితే ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇవన్నీ ఉన్నాయని నిరూపించేలా ఒక వీడియో కాల్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్ష్యాలను ప్రభావితం చేసేందుకు తనకు అనుకూలంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని చేసిన బెదిరింపు వీడియో కాల్ గా దీనిని చెబుతున్నారు. ఏకంగా సాక్ష్యులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు వంతున ఇచ్చి మరీ ప్రలోభాలకు గురి చేశారని వారి నుంచి ఖాళీ పత్రాల మీద సంతకాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

విచారణలో తేలింది :

ఇదిలా ఉంటే తనకు అనుకూలంగా కోర్టులో మాట్లాడకపోతే ఈ ఖాళీ పత్రాలను అడ్డం పెట్టుకుని అనంతబాబు కుట్ర పన్నారు అని కూడా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కడియాల చిన్నబాబు, కడియాల సతీష్, మాగంటి రాంబాబు అనే సాక్ష్యులను ఒక అపార్ట్మెంట్ కి తీసుకుని వెళ్ళి అనంత బాబు బేరసారాలకు దిగారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో రాసారని అంటున్నారు. ఇలా వీటి వెనక ఉన్న ప్రధాన కుట్రదారు అనంత బాబు అని పోలీసులు తేల్చారని చెబుతున్నారు. త.

కోర్టు షరతులు ఉల్లంఘించారు :

ఇదిలా ఉంటే పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన విషయాలు చూస్తే చాలానే ఉన్నాయి. నిందితుడు ఎమ్మెల్సీగా ఉన్నారని, ఆయన సమాజంలో పలుకుబడి కలిగిన వారు అని సర్పవరం పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన హత్య కేసులో విచారణకు అంతరాయం కలిగించి కీలకమైన సాక్ష్యులను ఆయన భయపెట్టారని పేర్కొన్నారు. నకు అనుకూలంగా సాక్ష్యాన్ని చెప్పకపోతే చంపి శవాలను మాయం చేస్తాను అని బెదిరించారని పోలీసులు పేర్కొన్నారు ఇది ఒక నేరం అని చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ హత్య కేసులో కోర్టు విధించిన షరతులను ఉల్లఘించారు అని కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

తప్పించుకోవాలని ప్లాన్ :

ఈ హత్య కేసు నుంచి తప్పించుకోవాలని అనంత బాబు ప్లాన్ వేశారు అని ఈ కేసులో ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తులో అనంతబాబు ఏ వన్ గా ప్రధాన నిందితుడిగా ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పించడం ద్వారా శిక్ష నుంచి తప్పించుకోవాలని ఆయన ప్లాన్ ప్రాధమికంగా రుజువు అయింది అని రిపోర్టులో వెల్లడించారు.

పరారి కావడంతోనే :

ఇక అనంత బాబు ని అరెస్ట్ చేయకపోతే పారిపోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన నాలుగు రోజుల పాటు పరారి కావడమే ఉదాహరణ అని కూడా పేర్కొన్నారు. తన మీద ఫిర్యాదు చేసిన వారి కుటుంబ సభ్యుల భద్రతకు కూడా ఆయన నిరంతరం ముప్పు కలిగిస్తున్నారని గతంలో కూడా నేర చరిత్ర ఆయనకు ఉందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఇక ఇదే కేసులో విచారణ సాగుతోందని మరింత మంది ముఖ్య సాక్ష్యులను విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేరొన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు అనుబంధంగా ఉన్న హత్య కేసులఒ 48 మంది ప్రాసిక్యూషన్ సాక్ష్యులు ఉన్నరని కూడా పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News