టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్- నెట్టింట ప్రశంసలు
తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీసుకున్న ఒక షాకింగ్ డెసిషన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీసుకున్న ఒక షాకింగ్ డెసిషన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ మీద చర్చ కూడా సాగుతోంది. ఇప్పటిదాకా ఎక్కడా ఏ ప్రజా ప్రతినిధి చేయని విధంగా ఆమె చేశారు అని అంతటా ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం ఇంత మెప్పు పొందడానికి కారణం సహేతుకంగానే ఉంది.
పీఏగా అపాయింట్మెంట్ :
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన వ్యక్తిగత కార్యదర్శిగా ఒక ట్రాన్స్ జెండర్ ని నియమించుకోవడం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. నిజానికి ఈ తరహా నియామకం ఎవరూ చేసి ఉండరు. తన ఆఫీసుకు వచ్చిన ట్రాన్స్ జెండర్ ఉద్యోగం కావాలని కోరడంతో ఎమ్మెల్యే రెండవ మాట లేకుండా ఆమెకు ఉద్యోగం ఇచ్చేశారు. బీకాం వరకూ ట్రాన్స్ జెండర్ చదువుకున్నారు. దాంతో విద్యార్హతను గుర్తించి జాబ్ ఇచ్చేశారు. ట్రాన్స్ జెండర్ లకు అండగా ఉండాలన్న సదాశయం కూడా దీని వెనకన ఉంది అని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు.
వారికి మద్దతు :
రాజకీయ నేతల విషయంలో నెటిజన్లు చాలా నిర్మొహమాటంగా ఉంటారు మంచి చేస్తే మెచ్చుకుంటారు. తేడా వస్తే అంతే ఘాటుగా విమర్శిస్తారు. ఈ క్రమంలో గళ్లా మాధవి తీసుకున్న ఈ నిర్ణయం మీద నెట్టింట పొగడ్తల వర్షం కురుస్తోంది. నిజానికి ఈ సమాజంలో ట్రాన్స్ జెండర్లు వివక్షకు గురి అవుతున్నారు వారిని ప్రభుత్వాలు ఎంతగా ముందుకు తీసుకుని రావాలని చూసినా కూడా అవమానాలు తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పరంగానే కాదు ఈ విధంగా కూడా వారికి ఒక మద్దతు అవసరం. ఆ పనిని గళ్ళా మాధవి చేయబట్టే ఆమెకు ఈ ప్రశంసలు దక్కుతున్నాయని అంటున్నారు. ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీ అంటే సమాజంలో గౌరవనీయమైన స్థానం. దానిని కల్పించి మరీ ఎమ్మెల్యే ట్రాన్స్ జెండర్ల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.
వెలి వేయకూడదనే :
ట్రాన్స్ జెండర్లను సమాజం వెలి వేయకూడదని ఎమ్మెల్యే మాధవి అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రైళ్లలో ట్రాన్స్ జెండర్లని చూసినపుడు ఆర్ధికంగా వారి ఇబ్బందులు గమనించినపుడు బాధగా ఉండేదని ఆమె అన్నారు. వారితో తాను సంప్రదించినపుడు కూడా తమను ఎవరూ ఆదరించడంలేదని బాధతో చెప్పేవారు అని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా వారి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ చదువు లేకపోవడం వల్లనే వారు వెనకబడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
వారికి అండగా ఉంటా :
ట్రాన్స్ జెండర్లకు తాను అండగా ఉంటాను అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అంటున్నారు. వారికి ఏదైనా పరిష్కారం చూపించాలన్నది తన ఆలోచనగా చెప్పారు. సమాజంలో కుక్కల గురించి పోరాడే వారు ఉన్నారు కానీ ట్రాన్స్ జెండర్ల విషయం ఆలోచించే వారు తక్కువ అని ఆమె అనడం విశేషం. తాను ఆఫీసులో ఒకరికి ఈ రోజు ఉద్యోగం ఇచ్చాను అని ఇదే తీరున మరో నలుగురికి కూడా సాయం చేసేందుకు తాను సిద్ధం అని గళ్లా మాధవి ఇస్తున్న హామీ ట్రాన్స్ జెండర్లలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. కూట మి ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు ఇళ్ళు సామాజిక పెన్షన్లు అందిస్తోంది అని ఆమె చెప్పారు మరింతగా వారి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తాను అని గళ్లా మాధవి ఇస్తున్న ఈ హామీ మెచ్చతగినది. మిగిలిన వారూ ఆమె బాటలో నడిస్తే ట్రాన్స్ జెండర్లకు మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు