ఎల్ నినో పడగ ... భారత్ లో 55 వేల మరణాలు తధ్యమా ?
ఇక ఎల్ నినో ప్రభావం అంచనా వేసి ఎక్కడ ఎంతటి తీవ్రత ఉంటుందో అంచనా వేయడానికి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్ ని రూపొందించింది.
ఎల్ నినో ఇప్పటిదాకా చూపించిన రూపం వేరు. రానున్న ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు ఏకంగా విశ్వ రూపమే చూపిస్తుంది అని అంటున్నారు. ఎల్ నినో పడగ నీడన ప్రపంచంలో అనేక దేశాలు ఉండబోతున్నాయని అందులో భారత్ కూడా ఒకటి అని అంటున్నారు. ఇప్పటిదాకా కేవలం నీటి కష్టాలతో పాటు నైరుతి రుతుపవనాలని మింగేసిన ఎల్ నినో ఇక మీదట ప్రజల ప్రాణాలనే కాటు వేయడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. 2027 మార్చి నాటికి సూపర్ ఎల్ నినో విశ్వ రూపం చూపిస్తుందని ఫలితంగా ఒక్క భారత్ లోనే 55 వేల మంది దాకా ప్రజలు మృత్యువాత పడతారు అని అంచనా వేస్తున్నారు.
అధిక వేడితో భూగోళం :
సూపర్ ఎల్ నినో అంటే భూగోళంలో సగం పైగా భాగాన్ని తన అధిక వేడిమితో చుట్టేయనుంది అని అంటున్నారు. దీంతో వడ గాలులు భారీ ఎత్తున వీచి ఉన్న ఉష్ణోగ్రతలకు మరింత వేడి రాజేసే సూపర్ ఎల్ నినో ప్రతాపంతో వేలాదిగా జనాలు భారత్ లో మరణిస్తారు అని అంటున్నారు. దీంతో నవంబర్ నుంచి మార్చి మధ్యలో 55 వేల మంది దాకా మరణించవచ్చు అని చెబుతున్నారు. ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే భయం కలిగిస్తున్నాయి. అసాధారణ వాతావరణ మార్పులు సూపర్ ఎల్ నినో వల్ల సంభవిస్తాయని అంటున్నారు. మామూలుగా చూస్తే వేసవిలో వడగాలుల వల్ల మరణాలు ఉంటాయి. కానీ అంతకంటే అధిక వేడిమిని ఎల్ నినో రాజేస్తుందని దాంతో ఈ మరణాలు తధ్యమని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు లక్షల 70 వేల దాకా ఎల్ నినో మరణాలు ఉండొచ్చు అని అంటున్నారు.
భారత్ పైన పడగ :
ఇదిలా ఉంటే ఎల్ నినో భారత్ మీద పడగ విప్పిందని అందువల్ల అధిక వేడిమి మరణాలు ఎక్కువే అని ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్ నివేదిక చెబుతోంది. 55 వేల మరణాలలో మార్చిలోనే అధికంగా ఉండొచ్చు అని పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే నైజీరియాలో 56 వేలు, ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్ లో 19 వేలు వంతున మరణాలు సంభవిస్తాయని అంటున్నారు. ఈ సూపర్ ఎల్ నినో హిస్టరీ చూస్తే 1950 తర్వాత అత్యంత బలంగా ప్రమాదకరంగా దూసుకుని వస్తోందని అంటున్నారు. దీని ప్రభావం అంతా 2027 లో ఎక్కువ అని చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరంగా 2027 ఉండబోతోంది అని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికలు చెబుతున్నాయి.
ముందస్తు హెచ్చరికలు :
ఇక ఎల్ నినో ప్రభావం అంచనా వేసి ఎక్కడ ఎంతటి తీవ్రత ఉంటుందో అంచనా వేయడానికి క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్ ని రూపొందించింది. ఈ ట్రాకర్ అందించే నివేదికలు ఉపయుక్తంగా జనాలకు దేశాలకు ఉంటాయని అంటున్నారు. ఎక్కడ ఎల్ నినో అధిక వేడిని ఉత్పత్తి చేస్తుంది దాని వల్ల ప్రజలకు ఎక్కడ ప్రమాదం ఎక్కువ ముప్పు పొంచి ఉంది అన్నది ఈ ట్రాకర్ ద్వారా అందించే నివేదికలు చెబుతూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తాయి. దాంతో ఆయా దేశాలలో ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం కలుగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ కో ఫౌండర్ మైఖెల్ గ్రీన్ స్టోన్ అంటున్నారు.
పేద దేశాల మీదనే :
ఎల్ నినో ప్రభావం అంతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు వెనకబడిన దేశాలతో కూడిన గ్లోబల్ సౌత్ రీజియన్ లోనే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆసియా, ఆఫ్రికా లాటిన్ అమెరికాలో ఈ దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉంటుంది, పేదరికంతో పాటు మౌలిక సదుపాయాలు పెద్దగా లేకపోవడం, వ్యవసాయం మీద ఈ దేశాలు ఎక్కువ ఆధారపడుతూంటాయి. ఈ దేశాల మీదనే ఇపుడు ఎల్ నినో పడగ విప్పడం విషాదంగానే అంతా చూస్తున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కే మార్గాలని పాలకులు అన్వేషించాలని అంతా కోరుకుంటున్నారు.