ఆర్నాద్ ఏపీకి చేసిన గొప్ప మేలు ఇదే !

ఇక ఏపీలో అనేక చెరువులు రిజర్వాయర్లు ఆర్నాద్ తుఫాన్ తరువాత జల కళను సంతరించుకుని కొత్త రూపుతో సండది చేస్తున్నాయి.

Update: 2026-10-30 03:31 GMT

ఆర్నాద్ భారీ తుఫాన్ ఏపీకి ఎంతో నష్టం చేసింది. ఏపీని విలయంగా మార్చింది. కోస్తా గుండెలలో జల ఖడ్గం దూసింది. పచ్చని పొలాలను చిచ్చుగా మార్చింది. ఏపీలో మౌలిక సదుపాయాలతో పాటు అన్ని విధాలుగా తీవ్ర నష్టమే వాటిల్లింది. అంతే కాదు ఆర్ధికంగా కూడా ఏపీకి పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది. వేలాది కోట్ల రూపాయల నష్టం అని ప్రాథమిక అంచనాలలో లెక్క తేలింది. ఇంకా చూస్తే అది మరింతగా పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. ఇంత నష్టం చేసి ఒక పీడకలగా మారిన అర్నాద్ తుఫాను అందులోనూ మేలు కూడా చేసింది. అదే ఏపీకి చాలా వరకూ నీటి కొరత లేకుండా చేసింది. ఆ లెక్కలు ఇపుడు అధికారులు చెబుతున్నారు.

జల కళతో అంతటా :

ఇక ఏపీలో అనేక చెరువులు రిజర్వాయర్లు ఆర్నాద్ తుఫాన్ తరువాత జల కళను సంతరించుకుని కొత్త రూపుతో సండది చేస్తున్నాయి. దాదాపుగా ఎండిపోయి బీడు వారిన చోట ఇప్పుడు పెద్ద ఎత్తున జలాలు చేరి ముచ్చట గొలుపుతున్నాయి. దీంతో ఇంత పెద్ద బాధలోనూ జనం అంతా సంతోషిస్తున్నారు. ఇక ఏపీలో రిజర్వాయర్లు చెరువుల్లో చేరుతున్న నీటిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకూ ఆర్నాద్ తుఫాన్ ప్రభావంతో ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రానికి సుమారు 380 టీఎంసీల నీరు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు. అలాగే రిజర్వాయర్లలో చూస్తే 4.68 టీఎంసీల నీరు అదనంగా చేరింది. మరో అయిదు నుంచి ఆరు టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ విధంగా చేరిన నీటిని రిజర్వ్ చేసి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కూడా అధికారులకు చంద్రబాబు సూచించారు.

అప్పటి దాకా విశ్రమించవద్దు :

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తుఫాను బాధిత ప్రాంతాలలోని ప్రతి ఇంటిలోనూ ప్రతి గ్రామంలో సాధారణ పరిస్థితి నెలకొనేవరకు అధికారులు విశ్రమించకుండా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాల్సిందే అని అధికారులకు సూచించారు. విద్యుత్ పునరుద్దరణ పనులు మరింత వేగవంతం కావాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి అదనపు విద్యుత్ సిబ్బందిని తరలించి వారి సేవలు వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. తుఫాను ముందు తరువాత కూడా అధికారులు సిబ్బంది కష్టపడుతున్నారని అయితే చివరి వ్యక్తికి సాయం అందేవరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో విద్యుత్ రహదారులు టెలికాం సేవల పునరుద్ధరణ తో పాటు వ్యవసాయ ఉద్యాన పంటల పరిస్థితి వంటి వాటి మీద చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు పర్యటించిన తరువాత ఉండవల్లి లోని తన నివాసంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఈ సమీక్ష చేయడం విశేషం.

Tags:    

Similar News