ఆ రెండు పార్టీల తలరాతను రాయనున్న విజయ్.. కారణం ఇదేనా..?
తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక భారీ మలుపుగా నిలవబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది.;
తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక భారీ మలుపుగా నిలవబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే మధ్య సాగిన ద్విముఖ పోరును చెరిపేస్తూ, దళపతి విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ ద్వారా తీసుకొచ్చిన మార్పు అందరినీ ఉత్కంఠతకు గురిచేస్తోంది. మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపులో 'క్లోజ్ మార్జిన్' ఫలితాలను తారుమారు అయ్యే అవకాశం ఉంది.
తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్ రోజుపైనే ఉన్నాయి. ఈ సారి రికార్డు స్థాయిలో 84 శాతం ఓటింగ్ నమోదవడం, అందులోనూ యువత పెద్ద ఎత్తున తరలిరావడం రాజకీయ వర్గాల్లో గుబులు రేపుతోంది. గత ఎన్నికల్లో కొన్ని వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల తలరాతలు మారాయి. ఇప్పుడు విజయ్ రూపంలో మూడో లేదా నాలుగో ప్రత్యామ్నాయం బలంగా ఉండడంతో, ఓట్లు భారీగా చీలి గెలుపోటముల అంతరం తక్కువగా ఉండబోతోంది. ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి 1,000 ఓట్ల తేడాతో ఫలితం తేలిపోయే అవకాశం ఉండడంతో, దళపతి విజయ్ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.
స్వల్ప మెజారిటీల మ్యాజిక్..
తమిళనాడు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన నియోజకవర్గాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2011లో 9 సీట్లు, 2016లో 16 సీట్లు, 2021లో 8 సీట్లలో వెయ్యి ఓట్ల లోపు మెజారిటీతోనే అభ్యర్థులు గెలిచారు. ఈ సారి చతుర్ముఖ పోటీ (DMK, AIADMK, NTK, TVK) నెలకొన్న నేపథ్యంలో, వెయ్యి నుంచి 5 వేల ఓట్ల తేడాతో ఫలితాలు తేలే నియోజకవర్గాల సంఖ్య 50 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడే విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార, ప్రతిపక్షాల గెలుపును శాసించబోతున్నాయి.
విజయ్ కౌంటింగ్ డే ప్లాన్..
ఓట్ల లెక్కింపులో చిన్న పొరపాటు జరిగినా ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందని భావిస్తున్న విజయ్, తన పార్టీ నేతలతో జూమ్ కాల్ ద్వారా కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్ కేంద్రం వద్ద 14 మందితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బృందం ప్రతి రౌండ్ లెక్కింపును, పోస్టల్ బ్యాలెట్లను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అభ్యర్థులు నిరంతరం నిఘా ఉంచాలి. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలి. ‘ప్రతి ఓటు విలువైనదే.. చిట్టచివరి ఓటు లెక్కించే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి ఎవరూ కదలవద్దు’ అని విజయ్ కేడర్‌కు దిశా నిర్ధేశం చేశారు. ఆధవ్ అర్జున వంటి సీనియర్ల నేతృత్వంలో ఈ పర్యవేక్షణ సాగనుంది.
మార్పు దిశగా యువత ఓటు ?
తమిళనాడులో ఈసారి 84 శాతం ఓటింగ్ జరగడం వెనుక విజయ్ క్రేజ్ ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఫస్ట్ టైం ఓటర్లు, రాజకీయాలకు దూరంగా ఉండే తటస్థ ఓటర్లు ఈసారి ‘మార్పు’ కోరుకుంటూ విజయ్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ పార్టీ దక్కించుకున్న ప్రతి ఓటు డీఎంకే లేదంటే అన్నాడీఎంకే ఓటు బ్యాంకు నుంచే వస్తుంది. దీనివల్ల ఆ రెండు పార్టీల మధ్య మెజారిటీ తగ్గిపోయి, అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సినీ నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం కేవలం ఒక సినిమా స్టార్ ఎంట్రీ లాగా కాకుండా, ఒక వ్యవస్థీకృత పార్టీగా రూపుదిద్దుకోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున, లెక్కింపు ప్రక్రియలో టీవీకే కార్యకర్తలు చూపించే అప్రమత్తతే ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తమిళనాడులో దశాబ్దాల ద్విముఖ రాజకీయాలకు విజయ్ చెక్ పెడతారా..? లేక కింగ్ మేకర్‌గా నిలుస్తారా..? అనేది వచ్చే నెల (మే) 4న తేలిపోనుంది. ఏది ఏమైనా, ఈసారి ఫలితాలు ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయన్నది వాస్తవం.