ఆంధ్రా యూనివర్సిటీ కోసం......బ్రిటిష్ వారితో పోరాటం

విశాఖ సాగర తీరాన ఘనత వహించిన విశ్వవిద్యాలయంగా ఆంధ్రా వర్శిటీ ఉంది.;

Update: 2026-04-26 18:39 GMT

విశాఖ సాగర తీరాన ఘనత వహించిన విశ్వవిద్యాలయంగా ఆంధ్రా వర్శిటీ ఉంది. ఇక్కడ నుంచి ఎంతో మంది విద్యాబుద్ధులు నేర్చి దేశంలో కీలక పదవులు అందుకున్నారు. రాష్ట్రపతులుగా ఉప రాష్ట్ర పతులుగా గవర్నర్లుగా కేంద్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా లోక్ సభ స్పీకర్లుగా రాష్ట్ర మంత్రులుగా ఇలా అనేకమైన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అదంతా ఏయూ గొప్పతనమే. ఆంధ్రా వర్శిటీ ఒక వట వృక్షం గా మారి ఎందరికో విజ్ఞానం ప్రసాదించింది. మరెందరికో విద్యా దానం చేసింది ఆ విద్యా కుసుమాలు దేశమంతా పరిమళం వెదజల్లి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.

ఏయూ ఉండాలన్న కోరిక :

అప్పటికి ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉంటూ వచ్చింది. ఒక వైపు దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగుతోంది. మరో వైపు ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ పోరాటంలో పాల్గొంటూనే తెల్ల దొరల నుంచి ఆంధ్రాకు రావాల్సిన సదుపాయాలను సౌకర్యాలను డిమాండ్ చేసి అందిపుచ్చుకునేందుకు ఉద్యమిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండడంతో ఆంధ్రా నుంచి ఉన్నత చదువులు చదువుకునే విద్యార్ధులకు దూరా భారాలు ఇబ్బందులు ఏర్పాడుతున్నారని ఫలితంగా ఎంతో మంది చదువుకు దూరం అవుతున్నారని భావించి ఆంధ్రాకు ఒక విశ్వవిద్యాలయం కావాలని నాటి ఆంధ్ర నేతలు పట్టుబట్టారు.

ఒక చరిత్రగా మారింది :

ఏయూ ఏర్పాటు కోసం 1914లో బాపటలో నిర్వహించిన ఆంధ్ర మహాసభలో ఒక తీర్మానం ఆమోదించారు. దానికి ముందు బీఎస్ శర్మ అనే నాయకుడు ఈ డిమాండుని ఆంధ్రా మహా సభ ముందు పెట్టారు. ఆ మీదట పన్నెండేళ్ళ పాటు ఏయూ ఏర్పాటు కోసం నాడు పెద్ద ఉద్యమమే సాగింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆంధ్రాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అంగీకరించారు. అయితే మొదట్లో విజయవాడలో ఏర్పాటు చేద్దామని అనుకున్నారు కానీ ఉత్తరాంధ్ర వాసుల నుంచి వచ్చిన డిమాండ్ తో వర్శిటీని 1926 ఏప్రిల్ 26న ఏర్పాటు చేశారు. అలా విశాఖలో ఒక అద్భుతమైన విశ్వ విద్యాలయం వచ్చింది.

తొలి వీసీగా ఆయన :

ఏయూకి తొలి వీసీగా సర్ సీఆర్ రెడ్డి నియమితులు అయ్యారు. ఆయన ఏయూ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. ఏయూ వందేళ్ళ భవిష్యత్తుని ఆనాడే ఆయన ఊహించి మరీ దానికి తగినట్లుగా రూపకల్పన చేశారు. ఆ తరువాత రెండవ వీసీగా డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ నియమితులు అయ్యారు. ఆయన హయాంలో ఏయూ మరింతగా విస్తరించింది. అన్ని విధాలుగా ముందుకు సాగింది. మూడవ వీసీగా మరోసారి కట్టమంచి వారే ఈ పదవి స్వీకరించారు. మొత్తం మీద 20 ఏళ్ళ పాటు కట్టమంచి వారే ఏయూ వీసీగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. అయితే ఏయూ స్థాపనకు ఏపీకి అది తరలి రావడానికి కారణం అయిన బీఎస్ శర్మ గురించి పెద్దగా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కానీ ఈ వందేళ్ళ ఉత్సవాల మూలంగా ఆయనను ఇపుడు మళ్ళీ తలచుకుంటున్నారు. ఏయూ కోసం కృషి చేసిన వారు అనేక మంది చరిత్ర పుటలలో భద్రంగా ఉన్నారు. వారిని గురించి ఈ తరానికి తెలియచేయడమే కాకుండా స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News