టోల్ ప్లాజా సిబ్బందిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు
విషయానికి వస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకుని తిరుగు ప్రయాణం అయిన సందర్భంలో ఈ దాడి జరిగింది.;
ఒక వైపు అంతా జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలని టీడీపీ అధినాయకత్వం చెబుతోంది. మరో వైపు మాత్రం మాకేమి సంబంధం లేదన్నట్లుగా ఎమ్మెల్యేలు కీలక నేతలు తమ ఇష్టం వచ్చిన తీరున వ్యవహరిస్తున్నారు. దానికి తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అనుచరులు వేసిన వీరంగం. అంతా దగ్గరుండి తమాషా చిత్తగించిన ఎమ్మెల్యే వ్యవహారం. ఇపుడు ఇదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చగా సాగుతోంది.
మరీ ఇంత దారుణమా :
ప్రజా ప్రతినిధి అంటే పద్ధతిగా ఉండాలి. ఆయన అనుచరులు అంటే ఇంకా జాగత్తగా ఉండాలి. కానీ తాజా సంఘటన చూస్తే మరీ ఇంత దారుణమా అన్నట్లుగా ఎమ్మెల్యే అనుచరుల ప్రవర్తన ఉంది. మమ్మల్నే ఆపుతారా అంటూ ఏకంగా ఒక ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. టోల్ ప్లాజా వద్ద అతి పెద్ద వీరంగం సృష్టించారు. ఇదంతా సోషల్ మీడియాలో ఇపుడు తెగ వైరల్ అవుతోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుల తీరు మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె తిరుపతి జాతీయ రహదారిపైన గుండబోయినపల్లె వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది మీద ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం స్థానికంగా సంచలనం రేపింది.
టోల్ ఫీజు చెల్లించమంటారా :
విషయానికి వస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకుని తిరుగు ప్రయాణం అయిన సందర్భంలో ఈ దాడి జరిగింది. సరిగ్గా వాల్మీకి పురం టోల్ గేట్ వద్దకు రాగానే అక్కడి సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలని కోరారు. అయితే ఎమ్మెల్యే వాహనాలు అని గుర్తించినా కూడా టోల్ ఫీజు చెల్లించమంటారా అంటూ ఆయన అనుచరులతో పాటు గన్ మెన్ కూడా ఒక్కసారిగా ఆగ్రహించారు. అంతే వెంటనే కారు లో నుండి దిగి గన్ మెన్ టోల్ బ్యారియర్ ని ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా టోల్ ప్లాజా మేనేజర్ రవిని మహిళా ఉద్యోగి అయిన లతను దూషించారు. ఆమె మీద కూడా దాడికి పాల్పడ్డారు ఏకంగా ఆమెను జుట్టు పట్టుకుని కొట్టడం అంత అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
వాహనంలోనే ఎమ్మెల్యే :
చిత్రమేంటి అంటే ఇంతలా తన అనుచరులు గన్ మెన్ వీరంగం చేస్తున్నా ఎమ్మెల్యే సురేంద్ర బాబు వాహనంలో కూర్చుని ఉండడం. అంత చోద్యం చిత్తగించడం. ఇలా టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడి చేసి తన అనుచరులు వీరంగం చేస్తే ఆయన అంతా చూస్తూ ఉన్నారు. ఆ మీదట తన అనుచరులను వాహనంలో ఎక్కించుకుని వాల్మీకి పురం పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళిన ఎమ్మెల్యే సీఐకి టోల్ ప్లాజా సిబ్బంది మీద రివర్స్ లో ఫిర్యాదు చేశారు. అంతే కాదు సీఐ సమక్షంలోనే పంచాయతీ పెట్టించి ఎమ్మెల్యేకు ఆయన అనుచరులకు టోల్ ప్లాజా సిబ్బంది చేత క్షమాపణలు చెప్పించుకోవడం అసలైన కొసమెరుపు. ఇక ఈ దాడి వీరంగం వంటివి సీసీ కెమెరాలో భద్రంగా రికార్డు అయి ఆ తరువాత సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో మొత్తం మ్యాటర్ బయటకు వచ్చింది.
తరచూ వివాదాల్లోకి :
కూటమి ప్రభుత్వాన్ని ఎన్నో సవాళ్ళ మధ్యన అధినాయకత్వం నడుపుతోంది. అంతే కాదు ప్రజలు అంతా గమనిస్తున్నారు. పద్ధతిగా ఉండాలని తమ ఎమ్మెల్యేలకు తరచూ టీడీపీ పెద్దలు అప్రమత్తం చేస్తున్నారు. కానీ అవేమీ పట్టించుకున్నట్లుగా లేదని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని కొంతమంది చేస్తున్న ఆర్భాటాలు దూకుడు విధానాలు వీరంగాలు వెరసి ప్రభుత్వానికి పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తున్నాయని అంటున్నారు. టోల్ గేట్ సిబ్బంది మీద దాడికి పాల్పడడం ఇపుడు రాష్ట్రమంతా చూసింది. మహిళా ఉద్యోగిని జుట్టుపట్టడమూ జనాల మెదళ్ళలో రికార్డు అయింది. బండ బూతులు రాష్ట్రం మొత్తం విన్నది, కాలితో తన్నుడు, కాలర్ పట్టుకుని గుంజుతూ చేసిన వికృత చేష్టలూ అన్నీ జనాలకు చేరిపోయాయి. అయినా ఇంతటితో ఆపుతారా అన్నదే పెద్ద ప్రశ్న. మాటలతో కాదు చేతలకు పార్టీ పెద్దలు దిగితేనే తప్ప ఇలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ పడదని అంతా అంటున్నారు.