‘ఆయనకి అన్నీ తెలుసు’.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డి పొగడ్తలు
తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ప్రారంభోత్సవం సందర్భంగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ప్రారంభోత్సవం సందర్భంగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. ముగ్గురు ముఖ్యనేతలను ఒకే వేదికపై చూసి అభిమానులు పులకించిపోయారు. ఇదే సమయంలో ముగ్గురు నేతల మధ్య అనుబంధంపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రారంభోపన్యాసం చేయగా ఆయన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సమయంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు విశేషంగా ఆకర్షించాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగుడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ‘‘మన అందరి కష్టాలు, మనందరి సమస్యలు తెలిసిన నాయకుడు’’ అంటూ చంద్రబాబును కీర్తించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు అన్న విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. సహజంగా సభలో మాట్లాడిన సందర్భంలో నేతల గొప్పతనం లేదా వారి హోదాలను చెప్పడం సర్వసాధారణం. కానీ, పలువురు ప్రముఖులు హాజరైన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పతనంపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడటమే ఆసక్తికరం అంటున్నారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ తరఫున పనిచేసిన రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు మెచ్చిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ నుంచి బయటకు వెళ్లిన ఆయన ఇప్పటికీ టీడీపీ అధినేతతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఇద్దరు నేతలు ఎక్కడ ఎదురైనా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంటుంది. వారిద్దరి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇద్దరికీ రెండు రాష్ట్రాల్లో భారీగా అభిమానులు ఉండటంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం భారీగానే కవరేజి ఇస్తుంటుంది.
ఇక ప్రాజెక్టుకు కొత్త గేట్లు ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్య పరిష్కారానికి సానుకూల వాతావరణం నెలకొందని, సమస్యల పరిష్కారానికి జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని ఆయన వెల్లడించారు. నీటి సమస్యల వల్ల వనరులు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నీటి వాటాలు, తుంగభద్రలో పూడికతీత వంటి అంశాలపై చర్చించామని తెలిపారు. ముఖ్యంగా తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన 10 టీఎంసీల నీటిని, ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల సమస్యలను పరిష్కరించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, దీనివల్ల చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమ, తెలంగాణాలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, తుంగభద్ర గేట్ల పునరుద్ధరణే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే పాలమూరు వంటి ప్రాంతాల ప్రజలు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. ఇకపై అనవసరమైన పంచాయితీలు పక్కనపెట్టి, సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చొరవతో మూడు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.