నిమ్మగడ్డపై హైకోర్టు సీరియస్

Update: 2020-10-23 06:30 GMT
అవును స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై హైకోర్టు అనేక అంశాలపై సీరియస్ అయ్యింది. ఎన్నికల నిర్వహణకు నిధుల మంజూరు, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ వేసిన  కేసును హైకోర్టు విచారించింది.  ఈ సందర్భంగా కొంత ఆసక్తికరమైన చర్చ జరిగింది.  ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయ సహకారాల గురించి అని తమ కేసులో చెప్పి విచారణ మొదలయ్యేసమయానికి  ఎలక్షన్ కమీషన్ కోర్టుల్లో వేసిన కేసుల గురించి నిమ్మగడ్డ లాయర్ ప్రస్తావించారు. దాంతో న్యాయమూర్తి అడ్డుకున్నారు.

ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయ సహకారాలని వకాల్తాలో చెప్పి ఇపుడు కేసుల గురించి మాట్లాడుతారేంటి అంటూ సీరియస్ అయ్యారు. దాంతో కమీషన్ కు  అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం ఇవ్వలేదని లాయర్ ఆరోపించారు. ఇదే విషయమై ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ సిబ్బంది అవసరమన్న విషయాన్ని కమీషన్ ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ లాయర్ ను జడ్జీ ప్రశ్నించినపుడు ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. దాంతో సిబ్బంది అవసరమన్న విషయాన్ని నిమ్మగడ్డ ప్రభుత్వంతో మాట్లాడలేదన్న విషయం అర్ధమైపోయింది.

ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ వేసిన కేసుల్లో వాదించిన లాయర్లకు చెల్లించాల్సిన ఫీజుల విషయం కూడా చర్చకు వచ్చింది. వివిధ అవసరాలకు ప్రభుత్వం కమీషన్ కు ఇస్తున్న నిధులను నిమ్మగడ్డ లాయర్ల ఫీజుల రూపంలో ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా కోర్టు అర్ధం చేసుకుంది. కమీషన్ ఖర్చులంటూ కమీషన్ సమర్పించిన బిల్లుల్లో అత్యధికం లాయర్ల ఫీజుల వివరాలే ఉన్నాయి. దాంతో న్యాయమూర్తి మాట్లాడుతూ లాయర్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బంతా ప్రజాధనమనే విషయం కమీషనర్ కు తెలుసా అంటూ సూటిగా ప్రశ్నించింది.

చివరగా కమీషన్ ఖర్చుల వివరాలను పరిశీలించిన కోర్టు కొన్ని ఖర్చులపై ఆరా తీసింది. అప్పుడు నిమ్మగడ్డకు హైదరాబాద్ లో కూడా మరో అధికార నివాసం ఉన్న విషయం చర్చకు వచ్చింది.  ఇదే విషయమై కోర్టు బాగా సీరియస్ అయ్యింది. ఏపి ఎలక్షన్ కమీషనర్ కు రెండు అధికార నివాసాలెందుకు ? అంటూ మండిపడింది. ఏపిలో ఎలక్షన్ కమీషనర్ కు హైదరాబాద్ లో అధికార నివాసం ఉండాల్సిన అవసరం ఏమిటంటూ నిలదీసింది. దీనికి నిమ్మగడ్డ లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. రెండు అధికారిక నివాసాల రూపంలో ప్రజాధనాన్ని నిమ్మగడ్డ వృధా చేయటం నిజంగా దురదృష్ణకరమంటూ తీవ్రంగా కోర్టు వ్యాఖ్యానించింది.  ఎన్నికల నిర్వహణకు ఇప్పటివరకు కమీషన్ కు ప్రభుత్వం రూ. 117 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం లాయర్ కోర్టుకు స్పష్టంగా చెప్పగా ఆ మొత్తం కమీషన్ కు అందినట్లు నిమ్మగడ్డ లాయర్ అంగీకరించటం కొసమెరుపు.
Tags:    

Similar News