టీం లోకేశ్.. కొత్త కమిటీలతో టీడీపీకి యువరక్తం
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీకి యువరక్తం ఎక్కించే ప్రయత్నం మొదలైంది. తాజాగా ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీలను పరిశీలిస్తే పాత-కొత్త సమ్మిళతంగా పదవుల పంపిణీ జరిగింది.;
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీకి యువరక్తం ఎక్కించే ప్రయత్నం మొదలైంది. తాజాగా ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీలను పరిశీలిస్తే పాత-కొత్త సమ్మిళతంగా పదవుల పంపిణీ జరిగింది. అయితే ఎక్కువగా భావినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కోసం యంగ్ టీమ్ రెడీ చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. బుధవారం టీడీపీ అధినేత ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీల్లో లోకేశ్ సన్నిహితులు, ఆయన సమ వయస్కులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. దీనిని బట్టి ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు తీసుకుంటున్న లోకేశ్ భవిష్యత్తులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సరికి పార్టీపై పూర్తి పట్టువచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేనట్లు జంబో కమిటీని ప్రకటించిన చంద్రబాబు ‘టీం లోకేశ్’పై ఎక్కువ ఫోకస్ చేశారని అంటున్నారు. తాజా కమిటీల్లో ఎవరెవరు ఉండాలన్న ఛాయిస్ ని లోకేశ్ కే వదిలేశారని, ఆయన సూచనలతోనే అధినేత నియామకాలు చేపట్టారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ఉదాహరణగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శలు, ఎక్స్ అఫీషియో సభ్యులతోపాటు కీలక పదవులకు ఎంపిక చేసిన నేతలను చూపుతున్నారు. పార్టీలో అధినేత తర్వాత నిర్ణయాత్మక శక్తిగా ఇన్నాళ్లు పొలిట్ బ్యూరో ఉండేది. ప్రస్తుతం పొలిట్ బ్యూరో అధికారాలను తగ్గించకుండానే దాని ప్రభావాన్ని కొనసాగిస్తూ లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించారు.
ఇక పొలిట్ బ్యూరోలో మొత్తం 29 మందిని తీసుకుంటే, అందులో ఎక్కువ మంది లోకేశ్ జట్టులో ఉన్న నేతల పేర్లే కనిపిస్తున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యులుగా గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, శ్రీరామ్ రాజగోపాల్, అనగాని సత్యప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీసీ జనార్దనరెడ్డికి నియమించడం చూస్తే భవిష్యత్తులోనూ లోకేశ్ కు అండదండగా నిలిచే నాయకత్వానికి దారులు వేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
అదేవిధంగా లోకేశ్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న పల్లా శ్రీనివాసరావుకి మరోమారు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారు చేయడంతోపాటు ఎక్స్ అఫీషియో మెంబర్ గా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. అదేవిధంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులుకు లోకేశ్ కోటా కిందే పొలిట్ బ్యూరో సభ్యత్వం కల్పించారని అంటున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కిలారు రాజేశ్ యువనేత లోకేశ్ కు గట్టి మద్దతుదారులు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు.
అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుల్లో సానా సతీష్, పీతల సుజాత, బుద్ధా వెంకన్న, నూకసాని బాలాజీ, బి.రాంగోపాల్ రెడ్డి లోకేశ్ సిఫార్సులతో పదవులను దక్కించుకున్నారు. వీరంతా భవిష్యత్తులో కూడా లోకేశ్ జట్టులో కీలక బాధ్యతలు నెరవేర్చనున్నారని అంటున్నారు. జాతీయ అధికార ప్రతినిధులుగా నియమితులైన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, గుణపాటి దీపక్ రెడ్డి వంటివారు లోకేశ్ కోటాలోనే పదవులు పొందారని అంటున్నారు. గత ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని పార్టీ కేడర్ ఆగ్రహానికి గురైన దీపక్ రెడ్డికి లోకేశ్ చొరవ వల్లే మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.
ఇక గౌతు శిరీష, చింతకాయల విజయ్, విఎస్ ముఖ్తియార్, అమరనాథ్ రెడ్డి, కిమిడి రాంమల్లిక్ నాయుడు, పంచుమర్తి అనురాధ, బొండా ఉమా, తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, నరసింహ యాదవ్, కూన రవికుమార్, కావలి గ్రీష్మ, సుంకర పావని, గొల్లపల్లి అమూల్య, డూండి రాకేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, పర్చూరి రమ్య, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోపాటు పది మంది జోనల్ కో-ఆర్డినేటర్లు లోకేశ్ బృందంలో కీలకంగా పనిచేస్తున్నవారే అంటున్నారు. వీరందరూ భవిష్యత్తులో కూడా యువనేత నాయకత్వానికి బాసటగా నిలుస్తారనే ఆలోచనతోనే వివిధ బాధ్యతలు అప్పగించారని వ్యాఖ్యానిస్తున్నారు.