దేశం కాషాయమయం... 16 రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు!!
దేశంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. బిహార్ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణస్వీకారం చేయడంతో మరో రాష్ట్రం బీజేపీ ఖాతాలో చేరింది.;
దేశంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. బిహార్ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణస్వీకారం చేయడంతో మరో రాష్ట్రం బీజేపీ ఖాతాలో చేరింది. ఇప్పటివరకు బిహార్ లో జేడీయూ నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించేవారు. గత రెండు దశాబ్దాలుగా విడతలు వారీగా బీజేపీతో కొన్నిసార్లు, ఆర్జేడీ మద్దతుతో కొన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీశ్ కుమార్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగారు. దీంతో బిహార్ బీజేపీ ఖాతాలో చేరింది. దీంతో దేశంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఉన్న 16వ రాష్ట్రంగా బిహార్ నిలిచింది.
ఒక్కో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ సాగిపోతున్న కమలదళం దేశాన్ని కాషాయమయంగా మార్చేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 16 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉండగా, మరో మూడు చోట్ల బీజేపీ మద్దతుతో భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వాలను నడుపుతున్నాయి. దీంతో మొత్తం 19 చోట్ల బీజేపీ ప్రభుత్వాలే నడుస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణాదిలో ఏపీ, పుదుచ్చేరి మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు నడుస్తుండగా, పశ్చిమబెంగాల్ లో తృణమూల్, ఝార్ఖండ్ లో జేఎంఎం, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ లేదా తమ భాగస్వామ్య పార్టీల ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం దిశగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అడుగులు వేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా బిహార్ ను చూపుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు కలలు కంటున్నారు. ఎట్టకేలకు వారి ఆశలు ఫలించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2014లో దేశంలో బీజేపీ గెలిచిన తర్వాత, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శరవేగంగా బీజేపీ విస్తరించిందని విశ్లేషిస్తున్నారు.
మోదీ ప్రధాని అవ్వక ముందు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లోనే బీజేపీ ప్రభుత్వాలు ఉండేవి. 2014లో ప్రధానిగా మోదీ ప్రమాణం చేసిన తర్వాత ఒక్కో రాష్ట్రం బీజేపీ ఖాతాలో చేరడం మొదలైందని గుర్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రావడంతోపాటు అంతకుముందు ఉనికే లేని అస్సాం వంటి రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాషాయ జెండా రెపరెపలాడించాలనే ఏకైక లక్ష్యంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఒక్కో రాష్ట్రంలో బీజేపీని విస్తరిస్తున్నారని అంటున్నారు.