ఏకగ్రీవాలపై హైకోర్టులో ఎస్‌ఈసీకి ఎదురుదెబ్బ .. ఏమైందంటే ?

Update: 2021-02-20 07:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఓ వైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మరో వైపు కార్పొరేషన్, మున్సిపల్ , జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. గత ఏడాది 9 వేల 696 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ స్థానాలకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కోవిడ్‌ విజృంభణ కారణంగా అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు.. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో బలవంతపు ఏకగ్రీవాలంటూ ఎస్ ‌ఈసీకి విపక్షాల ఫిర్యాదు చేశాయి.

అయితే , ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది.ఒకే ఒక నామినేషన్‌ దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం – 10 జారీ చేసిన ఏకగ్రీవాలపై ఈ నెల 23వతేదీ వరకు ఎలాంటి విచారణ జరపవద్దని ఎన్నికల కమిషన్, అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫాం – 10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ నెల 23 వరకు వెల్లడించరాదని ఆదేశించింది.

రాజ్యాంగంలోని అధికరణ 243 కే కింద తన అధికారాలకు అడ్డులేదని ఎన్నికల కమిషనర్‌ భావిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారులు ఏం చేయాలో నిబంధనల్లో స్పష్టంగా ఉంది. వారి విధుల్లో ఎన్నికల కమిషనర్‌ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి తక్షణమే ప్రకటించి ఫాం 10 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల కమిషనర్‌ చట్టాలను ఖాతరు చేయకుండా సూపర్‌ మ్యాన్‌ లా వ్యవహరిస్తున్నారు అని పిటిషనర్ల తరపు న్యాయవాది మోహన్‌రెడ్డి నివేదించారు.

పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది వీఆర్‌ ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ ఓ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తరువాత అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ఎన్నికల కమిషన్‌ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయక ముందే దాఖలైన ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని కమిషన్‌ తరపు న్యాయవాది అశ్వనీకుమార్‌ తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్ ‌కు ఉందా ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టంలో ఏమీ చెప్పనప్పుడు మాత్రమే 243 కే కింద అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంలో క్షుణ్నంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.



Tags:    

Similar News