సాయంత్రం వరకు 2 సెం.మీ. రాత్రి అయ్యేసరికి 20 సెంటీమీటర్లు!

Update: 2020-10-14 05:15 GMT
ప్రతి విషయానికి ఒక లెక్క ఉంటుంది. వర్షం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంట్లో ఉండి.. బాల్కనీలో నుంచి కానీ.. ఇంటి గుమ్మం నుంచి కానీ రోడ్డు మీద చూసినప్పుడు కనిపించే దూరం వరకు వాన తీవ్రత అసలు ఎంతన్నది అర్థం కాకపోవచ్చు. ఒకసారి బయటకు వచ్చి.. పాతిక కిలోమీటర్లు ప్రయాణిస్తే.. బోలెడన్ని విషయాలు బయటకు వస్తాయి. మంగళవారం కురిసిన వర్షపు తీవ్రతలో సిత్రమైన లెక్క ఉంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షం సరాసరి రెండున్న సెంటీమీటర్లకు మించదు. ఆ మాత్రం వర్షానికే అంతలా ఆగమాగమైందా? అన్న సందేహం అక్కర్లేదు.

వర్షం తీవ్రత తక్కువగా ఉండొచ్చు. కానీ.. అదే పనిగా గంటల కొద్దీ సన్నగా పడుతూ ఉంటే.. దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక లెక్క అయితే.. సాయంత్రం నాలుగు తర్వాత నుంచి కేవలం ఐదారు గంటల వ్యవధిలోనే 10 నుంచి 18 సెంటీమీటర్ల మధ్యలో వర్షం కురవటంతో పరిస్థితి మహా ఇబ్బందిగా మారింది.

అర్థరాత్రి దాటే వరకు కురిసిన వర్షంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో చిమ్మచీకటి.. ఇంటి బయటా చీకటే. ఇన్వర్టర్లు.. భారీ జనరేటర్లు ఉన్న వారికి ఫర్లేదు కానీ.. మిగిలిన వారి పరిస్థితి మాత్రం మహా ఇబ్బందికరంగా మారింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో అత్యధికంగా 31.9 సెంటీమీటర్ల వర్షం కురిస్తే.. హయత్ నగర్ లో 29.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పది నుంచి పదిహేను సెంటీమీటర్ల మధ్యలో వర్షం కురవటంతో.. సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది.

అంతకంతకూ పెరుగుతున్న వర్షం కారణంగా నాలాలు నిండిపోవటం.. చెరువులు ఓవర్ ఫ్లో కావటం.. ఆ నీరు సైతం రోడ్ల మీదకు రావటం.. రోడ్ల మీద ఉన్న వర్షపు నరు మరింత పెరగటంతో.. ఎటు వాటం ఉంటే అటు వెళ్లటంతో.. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా పల్లం ఉన్న ప్రతి ప్రాంతం వరదనీటిలో చిక్కుకుపోయింది. దీంతో.. మహానగరం మొత్తం ఆగమాగమైంది.
Tags:    

Similar News