సీబీఐ వెబ్ సైట్ లో హత్రాస్ కేసు ఎఫ్ ఐఆర్ ప్రత్యక్షం..వెంటనే తొలగింపు

Update: 2020-10-13 04:00 GMT
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్  లో బాలికపై నలుగురు యువకులు  అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును  ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తోంది. కాగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ పత్రాలు సీబీఐ  అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఇలా చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని గ్రహించిన అధికారులు వాటిని వెంటనే వెబ్సైట్ నుంచి తొలగించారు. అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు గానీ,  ఆమె కుటుంబీకులకు  సంబంధించిన పేర్లు కానీ నిబంధనల ప్రకారం బయటికి వెల్లడించకూడదు.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పత్రంలో బాధితురాలి పేరు కనిపించకుండా వైట్నర్ తో కొట్టి వేసినప్పటికీ వివాదాల చెలరేగే అవకాశం ఉండడంతో  అధికారిక వెబ్ సైట్ నుంచి ఎఫ్ ఐఆర్ ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీబీఐ  అధికారులు తెలిపారు.అత్యాచారానికి గురైన బాధితులు, మైనర్ల వివరాలు  పబ్లిక్ డొమైన్ లో వెల్లడించ కూడదని 2018 డిసెంబర్ లో జస్టిస్ మాదన్ బి లోకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ప్రింట్​, ఎలక్ట్రానిక్​ మీడియాకు ఆదేశాలు ఇచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. కాగా హత్రాస్ బాధితురాలి కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను సోమవారం అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ నమోదు చేసుకుంది. ఈ కేసు విచారణ నిర్వహించిన  జస్టిస్​ పంకజ్​ మిత్తల్, జస్టిస్​ రాజన్ రాయ్​తో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్​ 2కు వాయిదావేసింది. బాధిత కుటుంబ సభ్యులు నవంబర్​ 2న హైకోర్టులో మరోసారి హాజరు కావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News