టికెట్ లేదు.. టీడీపీకి మాజీ ఎంపీ రాజీనామా!

Update: 2019-03-21 16:48 GMT
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అప్పుడే రాజీనామా ప్రకటన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సరిగ్గా నలభై ఎనిమిది గంటలైనా తెలుగుదేశం పార్టీలో ఉండకుండా ఆయన రాజీనామా చేయడం విశేష పరిణమంగా చెప్పవచ్చు. ఒక మాజీ ఎంపీ ఇలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి  అలా బయటకు వచ్చేయడం ఆసక్తిదాయకమైన అంశమే.

అది కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హర్షకుమార్ తెలుగుదేశంపార్టీ కండువా కప్పుకున్నారు. బాబు  కాళ్ల మీద పడి మరీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. బహిరంగ సమావేశంలో ఆ చేరిక జరిగింది.

అయితే హర్షకుమార్ మాత్రం ఇంతలోనే  తెలుగుదేశంపార్టీకి వీడ్కోలు పలకడం విశేషం. అమలాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం అష్టకష్టాలు పడింది. సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు రాజీనామా చేసి వెళ్లిపోవడంతో అక్కడ అభ్యర్థిని నిలబెట్టుకోవడం కోసం బాబు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా చాలా మందిని సంప్రదించారు. చాలా మందిని పరిగణనలో తీసుకున్నారు.

అందులో భాగంగా హర్షకుమార్ ను కూడా అభ్యర్థిగా అనుకున్నారు బాబు. ఈ మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీలోకి చేరక ముందే.. చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ కూడా ఖరారు చేసేశారని ప్రచారం జరిగింది. అయితే తీరా చేరాకా.. బాబు ఝలక్ ఇచ్చారు.

 అమలాపురం ఎంపీ టికెట్ ను హర్షకుమార్ కు కేటాయించకుండా.. బాలయోగి తనయుడికి కన్ఫర్మ్ చేశారు. దీంతో హర్షకుమార్ కు సహజంగానే తీవ్రమైన అసంతృప్తి కలిగి ఉండొచ్చు. టికెట్ అని పిలిచి, అది ఇవ్వకపోయే సరికి ఆయన  తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్పారు. మొత్తానికి రెండ్రోజుల్లోనే హర్షకుమార్ తెలుగుదేశం ప్రయాణం ముగిసినట్టుంది!


Tags:    

Similar News