టెక్సాస్ కాల్పులకు ముందు నిందితుడు రామోస్ ఏం చేశాడంటే..!

Update: 2022-05-26 06:30 GMT
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉవాల్డే టౌన్ లో ఉన్న రాబ్ ఎలిమెంటరీ స్కూళ్లో ఉన్మాది కాల్పులకు 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు 18 ఏళ్ల సాల్వడార్ రామోస్ కాల్పులకు ముందు ఏం చేశాడో తెలుసుకుంటే అతడిది ఎంతటి రాక్షస మనస్తత్వమో అర్థమవుతోంది.

అమెరికాలో 18 ఏళ్లు నిండితే గన్ కొనుక్కోవడానికి అనుమతి ఉంటుంది. దీనికి ఎలాంటి లైసెన్సు అక్కర్లేదు. గత వారమే నిందితుడు సాల్వడార్ రామోస్ కి 18 ఏళ్లు నిండాయి. దీంతో అతడు ఏఆర్ 15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్ కొన్నాడు. వాటి ఫొటోలను తన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ ఖాతాల్లో కూడా పోస్టు చేశాడు. స్కూళ్లో కాల్పులకు బయలుదేరే ముందు మంగళవారం ఉదయం 11 గంటలకు  అతడు తన ఇంటిలో నాయనమ్మను కాల్చాడు. ఆ తర్వాత మంగళవారం ఉదయం 11.30 గంటలకు స్కూళ్లో కాల్పులు జరిపాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ వివరాలను పేర్కొన్నాడు.

నాయనమ్మను కాల్చబోతున్నా... అని ఆమెను కాల్చడానికి ముందు అంటే ఉదయం 11 గంటలకు ముందు తన ఫేస్ బుక్ ఖాతాలో సాల్వడార్ రామోస్ పోస్టు పెట్టాడు. ఆమెను కాల్చిన తర్వాత... ఇప్పుడు స్కూళ్లో కాల్పులు జరపడానికి వెళ్లబోతున్నా.. అంటూ మరో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత అరగంటకే అంటే 11.30 గంటలకు మాటలకందని దారుణానికి పాల్పడ్డాడు. స్కూళ్లో ప్రవేశించి తన రైఫిల్ తో దొరికినవారిని దొరికినట్టు కాల్చేశాడు. ముక్కుపచ్చలారని చిన్నారులు అతడి తూటాలకు బలయ్యారు.

కాగా నిందితుడు సాల్వడార్ రామోస్ కాల్పులు జరపడానికి ముందు నుంచే అంటే మంగళవారం ఉదయం నుంచే ఈ దిశగా సంకేతాలు ఇస్తూ వచ్చాడు. లాస్ ఏంజెల్సుకు చెందిన యువతికి ఇనస్టాగ్రాములో ఈ మేరకు సమాచారమిచ్చాడు. ఉదయం 9.16 గంటలకు ఒక చిన్న రహస్యం చెప్పుబోతున్నా అంటూ ఆమెకు పంపిన మెసేజులో పేర్కొన్నాడు. ఉదయం 9.30 గంటలకు.. ఇంకాసేపటిలో నేను అంటూ ఒక స్మైలీ ఎమోజీ పెట్టాడు. ఉదయం 11 గంటలలోపు ఏం చేయబోతున్నానో చెప్తా అని మరో మెసేజు కూడా పెట్టాడు. తన టిక్ టాక్ ఖాతాలో కూడా పిల్లలూ భయపడేందుకు సిద్దంగా ఉండండి అని కూడా రాసుకున్నాడు. దీని బట్టి అతడు ఒక పక్కా ప్రణాళికతోనే, ముందుగా నిర్ణయించుకునే కాల్పులకు తెగబడ్డాడని అర్థమవుతోంది.

అమెరికాలో ఈ ఏడాది ఇది 212వ కాల్పుల ఘటన కావడం గమనార్హం. ఇలాంటివి సగటున రోజుకు ఒకటి చొప్పున అమెరికాలో జరుగుతున్నాయని ఒక స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అలాగే అమెరికా స్కూళ్లలో కాల్పులు జరగడం ఈ ఏడాది ఇది 27వ ఘటన కావడం గమనార్హం. తాజా ఘటన అమెరికా స్కూళ్ల కాల్పుల్లో రెండో అతిపెద్దది. 2012లో కనెక్టికట్ లో శాండీ హాక్ ఎలిమెంటరీ స్కూళ్లో జరిగిన కాల్పుల్లో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే.

కాగా తాజా ఘటనలో నిందితుడు సాల్వడార్ రామోస్ కు నత్తి సమస్య ఉందని.. స్కూళ్లో చదువుకునేటప్పుడు పిల్లలంతా అతడిని ఎగతాళి చేసేవారని తెలుస్తోంది. అలాగే అతడు పేదవాడు కావడం, అతడు ధరించే బట్టలు మురికిగా ఉండటం తదితర కారణాలతో రామోస్ ను ఏడిపించేవారని అంటున్నారు. అంతేకాకుండా రామోస్ ను గే లాగా ఉన్నావని ఆటపట్టించేవారని.. దీంతో అతడు అప్పటి నుంచే ఉన్మాదిగా మారాడని చెబుతున్నారు. దీంతో అతడు స్కూల్ కు సరిగా వచ్చేవాడు కాదని.. ఆ తర్వాత స్కూలు పూర్తిగా మానేశాడని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News