వైజాగ్ కార్పొరేషన్ వైసీపీదేనట...రాజధాని ప్రభావమేనా ?

Update: 2020-10-16 08:30 GMT
ఎన్నికలు ఎప్పుడు జరిగినా విశాఖపట్నం కార్పొరేషన్ వైసీపీదేనా ? క్షేత్రస్ధాయిలోని వాతావరణాన్ని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వైజాగ్ కార్పొరేషన్ లో ఎన్నికలు జరిగితే ఓటరు మనోగతం ఏమిటో తెలుసుకునేందుకు వీడీపాఏ అసోసియేట్స్ అనే సంస్ధ ఓటరునాడిపై సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం విశాఖ కార్పొరేషన్లోని మొత్తం 98 డివిజన్లలో వైసీపీకి సుమారు  84-89 డివిజన్లు వరకు రావచ్చని తేలింది. ఇక టీడీపీ పరిస్దితి మరీ దారుణంగా ఉందట. తెలుగుదేశంపార్టీకి 8-14 డివిజన్ల మధ్య వచ్చే అవకాశం ఉందని అర్ధమైంది.

ఇప్పటికిప్పుడు వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే అధికారపార్టీకి ఓట్లేస్తామని 49.8 శాతం మంది స్పష్టంగా చెప్పారట. అలాగే టీడీపీకి ఓట్లేస్తామన్నవారి శాతం 36. 5. ఇక జనసేనకు ఓట్లేస్తామన్న వారు 4.1 శాతం, కమలంపార్టీ వైపు మొగ్గు చూపిన వారు 2.8 శాతం, కాంగ్రెస్ కు ఓట్లేస్తామని 1.7 శాతం చెప్పారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా టీడీపీకి ఓట్లేస్తామనే వారు 36.5 శాతం మందున్నారంటే మామూలు విషయం కాదు.

ఇదే సమయంలో వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా చేస్తామని జగన్ చేసిన ప్రకటన కూడా బాగా ప్రభావం చూపుతోందా అనే అనుమానం పెరుగుతోంది. ఎందుకంటే వైజాగ్ ను రాజధానిగా ఎవరు అడగలేదని చంద్రబాబునాయుడు+టీడీపీ నేతలు చెప్పటంలో వాస్తవం లేదు. తమ ఊరిని రాజధానిగా చేస్తామని ప్రకటిస్తే ఎవరైనా వద్దంటారా ?  పైగా రాజధానిగా అన్నీ హంగులున్న వైజాగ్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో జనాలు వద్దనే చాన్సే లేదు. ఏదో జగన్ మీద కోపంతో, అమరావతి మీద ప్రేమతోనే చంద్రబాబు ఈమాటను పదే పదే అంటున్నారన్న విషయం అర్ధమైపోతోంది.

మొత్తం మీద రాజధాని ప్రకటన కావచ్చు, వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో సానుకూల స్పందన కావచ్చు మొత్తం మీద వైసీపీ వైపే జనాల మొగ్గుందన్న విషయం వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వేతో అర్ధమవుతోంది. సర్వేలన్నీ నిజాలవ్వాలని ఏమీ లేదు కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మాత్రం వైజాగ్ కార్పొరేషన్ లో అధికారపార్టీ జెండా పాతటం మాత్రం ఖాయమని ఇంతకుముందే అర్ధమైపోయింది. కాకపోతే ఇపుడు సర్వే రూపంలో ప్రజల నాడి తెలుస్తోంది.
Tags:    

Similar News