అప్పట్లో బొత్స.. ధర్మాన ఏం చెప్పారంటే.. టీడీపీ ఎంపీ ఫ్లెక్సీలు
‘‘జగన్ చాలా ప్రమాదకారి. క్రిమినల్స్ తో సంబంధాలు ఉన్నాయి. దోచుకున్నది దాచుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ను సీఎం చేయకపోవటం ద్వారా రాష్ట్రాన్ని సోనియా కాపాడారు’’;
‘‘జగన్ చాలా ప్రమాదకారి. క్రిమినల్స్ తో సంబంధాలు ఉన్నాయి. దోచుకున్నది దాచుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన్ను సీఎం చేయకపోవటం ద్వారా రాష్ట్రాన్ని సోనియా కాపాడారు’’
‘‘జగన్ ది చిన్నప్పటి నుంచే నేరప్రవ్రత్తి. ఆయుధ విక్రేతలతో ఆయనకు స్నేహం.. సాన్నిహిత్యం ఉన్నాయి. ఆర్థిక నేరాల్లో కూరుకుపోయిన జగన్.. వాటి నుంచి జనం ద్రష్టి మళ్లించేందుకు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారనే డ్రామాలతో హడావుడి సృష్టిస్తున్నారు’’
‘‘జగన్ కు విలాసవంతమైన బంగళాలు ఎలా వచ్చాయి? పులివెందుల.. బెంగళూరు.. హైదరాబాద్ లలో విలాసవంతమైన భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి?’’
‘‘జగన్ కు ఓటు వేయడమంటే ప్రజాస్వామ్యానికి చేటు చేయటమే. దోపిడీయే ఆయన ఎజెండా. చట్టాన్ని సైతం జగన్ బ్లాక్ మొయిల్ చేస్తున్నారు’’
‘‘తాను సచ్ఛీలుడినని.. నీతిమంతుడినని అక్రమంగా సంపాదించలేదని జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? తన తండ్రిని వీధిపాలు చేసిన ఘనత జగన్ కే దక్కింది. ఏ కుమారుడూ చేయని విధంగా రికార్డు సృష్టించారు’’
‘‘2004కు ముందు రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులకు నేను ప్రత్యక్ష సాక్షిని. జగన్ అక్రమాలతో రాష్ట్ర ప్రతిష్ఠకే మచ్చ పడింది. జగన్ తీరు దొంగే ఎదుటివారిని దొంగ అన్నట్లుంది’’
‘‘ జగన్ వద్ద టన్నుల కొద్దీ అవినీతి డబ్బు ఉంది. ఆయనకు నైతిక విలువలు లేవు. ఆయన వద్ద ఉన్నదంతా నల్లధనమే. ఆ మొత్తాన్ని సాధారణ ప్రమాణికాల్లో చెప్పలేం. స్విస్ బ్యాంకు ఖాతాల్లోనూ ఇంత సొమ్ము దాచేందుకు అవకాశాలు లేకపోవటంతో టన్నుల కొద్దీ ధనాన్ని రహస్య ప్రాంతాల్లోనే నిల్వ చేశారు’’
‘‘తన కులం పేదరికం అంటున్న జగన్ సామాన్యుల గురించి ఆలోచించే వ్యక్తి అయితే హైదరాబాద్ లోటస్ పాండ్.. బెంగళూరులోని జగన్ బంగాళాను మీడియాకు చూపి.. దానిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించుకోవాలి. అక్కడ అన్ని గదులు లేవని మీడియా ధ్రువీకరిస్తే మేం అంగీకరిస్తాం. విజయనగరంలోని మా ఇంటిని కూడా మీడియా చూడొచ్చు’’
‘‘2006లో సీఎం క్యాంపు కార్యాలయ కార్యకలాపాల్లో జగన్ కల్పించుకోవటం ప్రారంభించినప్పటి నుంచే రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ఠ రోడ్డున పడింది. అంతకు ముందు మా అలాంటి వారి సాహచర్యంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిఅయ్యారు. జగన్ చేసేవి కుటిల రాజకీయాలు. సంఘ విద్రోహ శక్తులు.. నేరగాళ్లతో మీకున్ సత్సంబంధాలన్నీ బయటపడుతున్నాయి’’
‘‘ఐదేళ్లలో 67 కంపెనీలు రిజిస్టర్ చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అన్ని రిజిస్టర్ చేయించిన ఏ వ్యాపారస్థుడైనా ఈ దేశంలో ఉన్నారా? ముఖ్యమంత్రి అనే ఉద్యోగం వస్తే రాష్ట్రప్రభుత్వంలో వ్యాపారం బాగా చేసుకోచ్చని.. ఇంకా సంపాదించుకోవచ్చనేదే ఈ వ్యాపారస్థుడి తాపత్రయమంతా. జగన్ చేసే వ్యాపారానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు.
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంటే.. బోలెడు విమర్శలు.. ఆరోపణలు చేసింది ఎవరో కాదు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వీర విధేయతను ప్రదర్శించే నేతల జాబితాలో వైసీపీ సీనియర్ నేతలు కం మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ.. ధర్మాన ప్రసాదరావులే. గతంలో వివిధ సందర్భాల్లో వారు చేసిన వ్యాఖ్యలు తాజాగా తెర మీదకు వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చిన తర్వాత.. ఆయన తీరుపై వివిధ సందర్భాల్లో బొత్స.. ధర్మానలు మీడియా సమావేశాల్లో జగన్ తీరుపై విరుచుకుపడేవారు.
వీటికి సంబంధించిన వార్తలు వివిధ పత్రికల్లో అప్పట్లో పబ్లిష్ అయ్యాయి. తాజాగా అలా పబ్లిష్ అయిన న్యూస్ క్లిప్పులను ఒక ఫ్లెక్సీలా సిద్ధం చేసిన విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాముడు..తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అందరికి చూపించారు. ఆ రోజుల్లో జగన్ మీద బొత్స.. ధర్మాన చేసిన సంచలన విమర్శలు.. షాకింగ్ ఆరోపణలకు సంబంధించిన వార్తా క్లిప్పింగ్ లను చూపిస్తూ.. ఇప్పుడు వారి మాటల్ని ప్రస్తావిస్తూ.. తేడా లెక్కలను ఆయన ప్రస్తావించారు.
గతంలో జగన్ పై వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు 20కు పైనే వార్తా క్లిప్పింగులను ప్రదర్శించారు. ఉమ్మడి రాష్ట్రానికి బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవారు. అప్పట్లో రెవెన్యూ మంత్రిగా ధర్మాన వ్యవహరించారు. అప్పట్లో జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన వారు ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు. ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను వారు ద్ధరించింది ఏమీ లేదన్న అప్పలనాయుడు.. ఇప్పటికైనా ఆ ఇద్దరు నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న హితవు పలికారు. గతానికి సంబంధించిన న్యూస్ క్లిప్పులతో ఎంపీ అప్పలనాయుడి ప్రయత్నం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.