జగన్ ని మించి ఏబీవీ...కట్ చేస్తే అలా !
మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అంటే వైసీపీకి వ్యతిరేకం అని అంతా అంటారు.;
మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అంటే వైసీపీకి వ్యతిరేకం అని అంతా అంటారు. దానికి తగినట్లుగానే ఆయన మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షపూరితంగా వ్యవహరించింది అని అంటారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా గాలిలో ఉంచేశారు. అయిదేళ్ళ పాటు ఆయనను ఇబ్బందుల పాలు చేశారు అని చెబుతారు అయితే ఏబీవీ అంతకు ముందు 2014 నుంచి 2019 దాకా సాగిన చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారని ఆయన వైసీపీని అప్పట్లో ఇబ్బందుల పాలు చేశారు అన్నది గుర్తు పెట్టుకునే వైసీపీ తమ జమానాలో అంతా చేసింది అని కూడా చెబుతారు.
కూటమి టార్గెట్ గా :
ఏబీవీ పదవీ విరమణ చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయనకు కీలకమైన పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రాధాన్యత లేని నామినేటెడ్ పదవి దక్కిందని ఆయన అసంతృప్తి చెందారు అని ప్రచారం సాగింది. చివరికి ఏబీవీ ఆ పదవిని తీసుకోలేదు కూడా. ఇక ఆయన తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ పేరు ప్రకటించలేదు కానీ మేధావులను కలుస్తున్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు రౌండ్ టేబుల్ సమావేశాలలో ప్రసంగిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే జగన్ కంటే ఎక్కువగానే అని అంటున్నారు.
మావిగాన్ కి తాత్పర్యం :
నిజానికి జగన్ ఏ ఉద్దేశ్యంతో మావిగాన్ అని ప్రతిపాదించారో ఎవరికీ తెలియడం లేదు. దాని వెనక వ్యూహం ఉందా లేక అమరావతి మీద వ్యతిరేకత ఉందా లేక ప్లాన్ బీ అంటూ ప్లాన్ సీ అంటూ జగన్ ఇలాగే కొత్త పేర్లు చెప్పుకుంటూ వెళ్తారా అన్నది కూడా తెలియడం లేదు కానీ జగన్ మావిగాన్ ప్రతిపాదనలో వ్యూహాలు అయితే ఏబీవీ పట్టుకున్నారు జగన్ అమాయకుడు కారని అలాగే ఆయన జోకర్ అంతకంటే కారని ఏబీవీ తాత్పర్యం చెబుతున్నారు జగన్ కచ్చితంగా ఒక టార్గెట్ ని ఎంచుకుని మరీ మావిగాన్ అస్త్రం సంధించారు అని ఆయన అంటున్నారు అమరావతికి పెట్టుబడులను రానీయకుండా ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదని ఏబీవీ చెప్పడం విశేషం. దాంతో ఇంతకాలం జగన్ మావిగాన్ ని ట్రోల్స్ చేస్తూ వస్తున్న కూటమి వర్గాలు ఏబీవీ మార్క్ విశ్లేషణతో కలవరం చెందుతున్నాయి.
అమరావతి మీద ధాటీగా :
అంతటితో ఏబీవీ ఆగలేదు అమరావతి రాజధాని విషయంలో జగన్ సంధించిన ప్రశ్నలకు కొనసాగింపుగా మరిన్ని వేస్తున్నారు. యాభై వేల ఎకరాలు సేకరించిన తరువాత మళ్ళీ యాభై వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి తెచ్చిన సొమ్ముతో అమరావతిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారని సమాచారం ఉందని కూడా చెప్పారు. అలా చేస్తే అపుడు రెండవ విడత భూములు ఇచ్చిన వారి సంగతేంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. వారి కోసం మూడో విడత పూలింగ్ కి వెళ్తారా ఇలా చేసుకుంటూ పోతే ఏపీలో అప్పులు పెరిగితే ఎవరు బాధ్యులు అని ఆయన నిగ్గదీస్తున్నారు.
ఇబ్బందికరంగానే :
ఏబీవీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీ ఓట్లు చీల్చడానికి కూటమికి మేలు చేయడానికే అని ఒక దశలో ప్రచారం సాగింది. కానీ ఆయన కూటమినే గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి పోలీసు శాఖను చూసిన వారు కావడంతో ఆయన మాట్లాడిన మాటలు అయితే తటస్థులు మేధావి వర్గాలలోకి బలంగానే వెళ్తున్నాయని అంటున్నారు. అంతే కాదు పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అదే సమయంలో అమరావతి విషయంలో సరికొత్త సందేహాలు కలిగేలా కూడా చేస్తున్నాయని అంటున్నారు. జగన్ అమరావతి మీద విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకోని వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అమరావతికి వ్యతిరేకం అని ఫిక్స్ అయిన వారు ఉన్నారు. కానీ అదే ఏబీవీ లాంటి వారు టీడీపీకి నిన్నటిదాకా సన్నిహితుడు అని పేరున్న వారు చేసే విమర్శలకు విలువ ఎక్కువ అని అంటున్నారు దాంతోనే కూటమి ఇబ్బందికరంగా ఫీల్ అవుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏబీవీ దూకుడు ఏ విధంగా సాగుతుందో.