చంద్రబాబు ఆకస్మిక పర్యటన డైలాగ్... ఇంత బాగా పనిచేస్తోందా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో `ఆకస్మిక పర్యటనలు` చేస్తానని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.;
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో `ఆకస్మిక పర్యటనలు` చేస్తానని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గాలు మండలాల వారీగా కూడా ప్రభుత్వం చేపడుతున్న పనులు, అందిస్తున్న సంక్షేమం వంటి విషయాల్లో సీఎం చాలా సీరియస్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇవి సాధారణ ప్రజల్లో భారీ మార్పులు తీసుకువచ్చి కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకునేలాగా చేయాలి అన్నది చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఈ క్రమంలో ప్రతి నెల ఒకటో తారీకు లేదా దానికి ముందే పింఛన్లు అందిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలను కూడా సమయం ప్రకారం అమలు చేస్తున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఇటీవల దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు. అదే విధంగా పి -ఫోర్ ను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమాజంలో పేదరికం నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టారు. ఇక పెట్టుబడుల కల్పన, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు ఇతర పారిశ్రామిక రంగాల పరంగా కూడా అభివృద్ధిని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.
వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రజల్లో చర్చ పెట్టాలని ఆయన పదేపదే కోరుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని పోల్చి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ అధికారులకు కూడా ఇటీవల చంద్రబాబు లక్ష్యాలుగా నిర్దేశించారు. ఈ క్రమంలో తాను ఆకస్మిక పర్యటనలు చేస్తానని, ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని తెలుసుకుంటారని అనంతరం దీనిపై సమీక్ష చేసి వెనుకబడిన వారిని వదిలిపెట్టేది లేదని ఇటీవల బాపట్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు మరోసారి చెప్పారు.
దీంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇటు నాయకులు, అటు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. నిన్న మొన్నటి వరకు సమన్వయం లేకుండా వ్యవహరించిన అధికారులు.. ప్రజాప్రతినిధులు ఇప్పుడు సమన్వయంతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గం అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు అందుతున్న సంక్షేమంపై ఎమ్మెల్యేలు హోంవర్క్ చేస్తున్నారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధులు అడిగిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా ఒంగోలు జిల్లా కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర పేరుతో గ్రామాల్లో నిద్ర చేస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పోలవరం జిల్లా నూతన కలెక్టర్గా వచ్చిన అధికారి గిరిజన ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు. గిరిజనులతో కలిసి నిద్రించే ప్రయత్నం కూడా చేశారు. ఇలా ఆకస్మిక పర్యటనల తాలూకా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ఈ పర్యటనలు ఇంకా ప్రారంభించలేదు. కానీ ఆయన హెచ్చరిక మాత్రం బాగా పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది.