మావిగన్ ఆలోచన జగన్ దేనా...వైసీపీ నేతల ఒపీనియన్ ?
ఏప్రిల్ నెల 1వ తేదీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుని ప్రవేశపెడుతున్న వేళ సరిగ్గా తాడేపల్లి పార్టీ ఆఫీసులో జగన్ మీడియా మీట్ పెట్టారు.;
ఏప్రిల్ నెల 1వ తేదీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుని ప్రవేశపెడుతున్న వేళ సరిగ్గా తాడేపల్లి పార్టీ ఆఫీసులో జగన్ మీడియా మీట్ పెట్టారు. ఏకంగా రెండున్నర గంటలకు పైగా ఆయన మాట్లాడారు. అందులో చివరాఖరున జగన్ మెరిపించిన మెరుపులే మావిగాన్ అంటూ చేసిన ప్రతిపాదన. అమరావతికి ఆల్టర్నేషన్ గా ఇది ప్లాన్ బీ అని జగన్ చెప్పారు. ప్లాన్ ఏ గా విశాఖపట్నం చెప్పాం కానీ బాబు వినలేదు, అందుకే ప్లాన్ బీని తెచ్చాం, దీనిని అయినా అమలు చేయాలని కోరుతూ జగన్ మీడియా మీట్ ముగించారు.
కాకతాళీయంగానే :
ఇక జగన్ ప్రెస్ మీట్ మొదటి నుంచి చూసిన వారికి చివరిలో ఆయన చేసిన ఈ ప్రతిపాదన కాకతాళీయమే అని అనుకున్నారు. పైగా సెటైరికల్ గా చేశారు అని అనుకున్నారు. అయితే ఆ తరువాత వైసీపీ నేతలు మొత్తం దానిని పట్టుకుని మీడియా సమావేశంలో మాట్లాడడంతో అధినేత నుంచి వచ్చిన సూచనలు ప్రకారమే అని కూడా భావించారు. కేవలం జగన్ తన సొంత ఆలోచనతోనే ఈ విధంగా చెప్పారు అని కూడా అనుకున్నారు పార్టీలో ఇంతటి కీలకమైన విషయాన్ని ఏ మాత్రం చర్చించకుండా జగన్ తానుగా ప్రకటించారు అని కూడా చెప్పుకున్నారు. జగన్ తో అంతా ఏకపక్షమే అని కూడా ప్రత్యర్ధులు అన్నారు.
అందరితో సంప్రదించారా :
అయితే దీని మీద వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఒక తెలుగు చానల్ ఇంటర్వ్యూ చేస్తూ ఈ ప్రశ్నను సంధించింది. జగన్ పార్టీలో ఏ నిర్ణయం అయినా సొంతంగా తీసుకుంటారా అని అడిగింది. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందా అని కూడా యాంకర్ ప్రశ్నించారు. దానికి మిధున్ రెడ్డి జవాబు ఇస్తూ ఆసక్తికరంగానే మాట్లాడారు. జగన్ అన్ని నిర్ణయాలు అందరితో కలసి తీసుకుంటారు అని చెప్పారు. ఉదాహరణకు మావిగాన్ నిర్ణయం మీద కూడా అందరి అభిప్రాయాలను అడిగారని చెప్పారు. కొంతమంది రాత పూర్వకంగా తమ అభిప్రాయాలను రాసి ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. ఇపుడే కాదు జగన్ అధికారంలో ఉన్నపుడు ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా ఆయా జిల్లాల నేతలతో సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకునేవారు అని చెప్పారు. జగన్ బలమైన నాయకుడు కాబట్టి అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు అని బయట ప్రచారం అలా సాగుతోందని ఆయన అన్నారు.
ఎవరి ప్రతిపాదన :
ఇవన్నీ సరే కానీ అసలు మావిగాన్ ఆలోచన జగన్ కి సొంతంగా వచ్చిందా లేక పార్టీలో ఎవరైనా ఈ ప్రతిపాదన చేసి సూచించారా అన్నది మాత్రం మిధున్ రెడ్డి చెప్పలేదు. ఏది ఏమైనా మావిగాన్ ఆలోచన మీద ఎవరు ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు అన్నది కూడా తెలిసే చాన్స్ లేదు, ఎందుకంటే అది వైసీపీ అంతర్గత వ్యవహారం కాబట్టి అయితే ఇక్కడా మరో మాట కూడా ఉంది. నిన్నటిదాకా ఉత్తరాంధ్రా రాయలసీమ వెనకబడిన ప్రాంతం అని చెబుతూ అక్కడ రాజధానులు ఉండాలని కోరుతూ వచ్చిన వైసీపీ మళ్లీ విజయవాడ గుంటూరుల మధ్యనే అంతా అభివృద్ధి చేయమనడం ద్వారా ఆ ప్రాంతాల నుంచి ఏ మేరకు మద్దతు అందుకుంటుంది అన్నదే చర్చగా ఉంది. ఆయా ప్రాంతాల నేతలు మావిగాన్ మీద ఏ విధంగా పార్టీలో స్పందించారు అన్నది కూడా ఆసక్తికరమే అని అంటున్నారు.