సుప్రీంకోర్టు ఆదేశించినా కూల్చివేతలు ఆపని సర్కార్.. ఆగ్రహం

Update: 2022-04-21 12:23 GMT
ఇటీవల మత ఘర్షణలతో ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతం దద్దరిల్లింది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడి నిర్మాణాల కూల్చివేతకు ఢిల్లీ మున్సిపాల్ కార్పొరేషన్ హడావుడిగా రెడీ అయ్యి కూల్చివేతలు ప్రారంభించింది. బుల్డోజర్లతో నిర్మాణాలు నేలమట్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్లింది.

దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినా స్థానిక అధికారులు , ప్రభుత్వం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ లో స్థానిక అధికారులు వ్యవహరించిన తీరు దుమారం రేపింది. ఏకంగా సుప్రీంకోర్టు దీన్ని తప్పుపట్టింది.

కూల్చివేతలు నిలిపివేయమని ఆదేశించిన తర్వాత కూడా దానిని కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని మేయర్ కు తెలియజేసిన తర్వాత జరిగిన అన్ని కూల్చివేతలను మేం తీవ్రంగా పరిగణిస్తాం.. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలి’ అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

జహంగీర్ పురిలో కూల్చివేతలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాము గురువారం విచారణ చేపడుతామని.. అప్పటివరకూ యథాతథస్థితిని కొనసాగించాలని నిర్ధేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినా అక్కడ కూల్చివేతలు ఆగలేదు. న్యాయస్థానం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు అందకపోవడమే కారణమని స్థానిక అధికారులు కూల్చివేతలు చేస్తూనే ఉన్నారు.

ఈ విషయాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద పిటీషనర్ల తరుఫున న్యాయవాది ప్రస్తావించారు. వెంటనే స్పందించిన సీజేఐ రమణ కూల్చివేతలను ఆపాల్సిందిగా అధికారులకు సత్వరం తెలియజేయాలని కోర్టు సెక్రటరీ జనరల్ కు సూచించారు. ఆయన సూచనతో కూల్చివేతలను మున్సిపల్ కార్పొరేషన్ ఆపేసింది.

తాము పత్రాలు చూపించినా కూల్చివేతలు ఆపలేదని.. తమను లక్ష్యంగా చేసుకున్నారని బాధితులు ఆరోపించారు. చిన్నపాటి నిర్మాణాలను మాత్రమే తొలగించారని స్థానిక యంత్రాంగం వాదించింది. దానికి బుల్డోజర్లు ఎందుకని కోర్టు ప్రశ్నించింది.

హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్ పురిలో   అల్లర్లు జరిగాయి. ఊరేగింపు సందర్భంగా జహంగీర్ పురిలో  కొందరు వ్యక్తులు బహిరంగంగా కాల్పులు జరిపారు. కెమెరా విజువల్స్, సీసీటీవీ ఆధారంగా పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడైన అన్సార్ ను కోర్టుకు వెళుతుండగా మీడియా ఎదుట ‘పుష్ప’ సిగ్నేచర్ మూవ్ మెంట్ ను చేయడం వైరల్ అయ్యింది.
Tags:    

Similar News