యుద్ధం ముగిసిందా..? ఇరాన్ అణు కార్యక్రమానికి శాశ్వత బ్రేక్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.;
మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో నెలకొన్న సైనిక ఘర్షణలో అమెరికా స్పష్టమైన విజయం సాధించిందని, ఆ దేశ రక్షణ , కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన ఈ మీడియా సమావేశం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే యుద్ధం ముగిసిందని.. ఇరాన్ తో డీల్ చేసుకున్నామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.
అమెరికా సైనిక ఆధిపత్యం: ట్రంప్
ఇరాన్ సైనిక సామర్థ్యంపై అమెరికా చేసిన దాడులు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయని ట్రంప్ వివరించారు. ముఖ్యంగా ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, కీలకమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను అమెరికా సైన్యం నిర్వీర్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. "ప్రస్తుతం టెహ్రాన్ గగనతలంలో అమెరికా విమానాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వాటిని అడ్డుకునే కనీస సామర్థ్యం కూడా ఇరాన్‌కు లేదు. ఆ దేశ నాయకత్వం ప్రస్తుతం అత్యంత బలహీన స్థితిలో ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో శక్తి సమతుల్యతను మార్చివేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పక్షాన ఉన్న సైనిక పటిష్టత ఇరాన్‌ను చర్చల టేబుల్ వద్దకు వచ్చేలా చేసిందని స్పష్టమవుతోంది.
అణు ఆయుధాల ముగింపు.. చారిత్రాత్మక మలుపు
ఈ చర్చల వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్ బహిర్గతం చేశారు. ఇరాన్ తన అణు ఆయుధాల అభివృద్ధిని శాశ్వతంగా నిలిపివేసేలా ఒప్పందం కుదిరిందని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ఎన్నడూ అణు బాంబులను తయారు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం అమెరికాకే కాక.. ప్రపంచ శాంతికి ఒక భారీ విజయమని భావిస్తున్నారు. గతంలో కుదిరిన అణు ఒప్పందాల కంటే ఇది మరింత కఠినంగా, పారదర్శకంగా ఉంటుందని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇరాన్ నుంచి "పెద్ద బహుమతి".. చమురు రాజకీయం
ట్రంప్ తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఒక "పెద్ద బహుమతి" లభించిందని, అది అణు సంబంధిత అంశం కాదని స్పష్టం చేశారు. ఇది చమురు , గ్యాస్ రంగానికి సంబంధించినదని ఆయన వెల్లడించారు.
ఈ ప్రకటనతో హర్మూజ్ జలసంధి ప్రాముఖ్యత మరోసారి చర్చకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలకు సంబంధించి లేదా ఇంధన ధరల నియంత్రణకు సంబంధించి ఇరాన్ నుంచి అమెరికాకు అనుకూలమైన ఒప్పందం కుదిరి ఉండవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వ్యూహాత్మక బృందం.. చర్చల బాధ్యత వీరిదే..
ఇరాన్ తో చర్చలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రంప్ తన అత్యంత నమ్మకస్తులతో కూడిన బృందాన్ని ప్రకటించారు . ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ అల్లుడు, మధ్యప్రాచ్య వ్యవహారాల నిపుణుడు జారెడ్ కుష్నర్,
ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందం ఇరాన్ నాయకత్వంతో చర్చలు జరిపి త్వరలోనే ఒక సమగ్రమైన అధికారిక ఒప్పందాన్ని ఖరారు చేయనుంది.
ప్రపంచవ్యాప్త సందేహాలు.. నిరీక్షణ
ట్రంప్ ప్రకటనలు ఒకవైపు ఆశాజనకంగా ఉన్నప్పటికీ దీనిపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు. దీనిపై మరోవైపు ప్రపంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ నిజంగానే తన అణు వాంఛను వదులుకుంటుందా? లేక ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు ఇది ఒక తాత్కాలిక దౌత్య ఎత్తుగడనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయాలు మధ్యప్రాచ్య రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేసేలా ఉన్నాయి. ఒకవేళ ఈ ఒప్పందం విజయవంతమైతే దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ వైరానికి శాశ్వత ముగింపు పడే అవకాశం ఉంది.