దీపం ఉండగానే డీల్… వేల కోట్లకు ఆర్సీబీ విక్రయం!

ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) భారీ డీల్‌తో యజమాన్యం మారినట్లు సమాచారం.;

Update: 2026-03-25 06:31 GMT

ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) భారీ డీల్‌తో యజమాన్యం మారినట్లు సమాచారం. “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అన్న సామెతను నిజం చేస్తూ ఆర్సీబీ మాతృ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ సరైన సమయాన్ని ఎంచుకుని జట్టును విక్రయించింది. జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాల ప్రకారం.. ఈ డీల్ విలువ సుమారు 1.78 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.16,706 కోట్లు)గా అంచనా వేయబడుతోంది.

ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అత్యంత విలువైనవిగా గుర్తింపు పొందాయి. అయితే తాజాగా ఒక్క ట్రోఫీతోనే ఆర్సీబీ కూడా వాటిని మించి విలువను సంతరించుకుంది. దీనికి ప్రధాన కారణం జట్టు యొక్క అపారమైన అభిమాన వర్గం, సోషల్ మీడియాలో ఉన్న విపరీతమైన క్రేజ్.. అలాగే బ్రాండ్ బిల్డింగ్‌లో యాజమాన్యం అనుసరించిన ప్రత్యేక వ్యూహాలు. ప్రతి ఏడాది “అన్‌బాక్స్” పేరుతో నిర్వహించే కార్యక్రమం ద్వారా అభిమానులతో నేరుగా అనుసంధానం ఏర్పరచడం.. కార్పొరేట్ కంపెనీలతో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి చర్యలు జట్టును కేవలం క్రికెట్ టీమ్‌గా కాకుండా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా మలిచాయి.

ఆర్సీబీ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాలు జట్టు మార్కెట్ విలువను గణనీయంగా పెంచాయి. ముఖ్యంగా ఇటీవల ఐపీఎల్ ట్రోఫీ గెలవడం జట్టుకు మరింత గౌరవం, గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ జట్టును విక్రయించేందుకు ముందుకొచ్చింది.

ఈ డీల్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలోని ఒక కన్సార్షియం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కన్సార్షియంలో బిర్లా గ్రూప్‌తో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్లు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్‌స్టోన్ వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కూడా ఈ ఒప్పందంలో భాగస్వామిగా ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి.

యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ ఈ నిర్ణయం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థ పూర్తిగా మద్యం వ్యాపారంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇతర రంగాల్లో ఉన్న పెట్టుబడులను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రీమియం మద్యం ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే ఈ సంస్థ, తన ప్రధాన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఈ డీల్ ద్వారా భారీ నిధులను సమీకరించినట్టు అంచనా.

ఇక ఐపీఎల్ చరిత్రలో మీడియా సంస్థలు జట్టు యాజమాన్యంలో భాగస్వామ్యం కావడం ఇది రెండోసారి. గతంలో డెక్కన్ క్రానికల్ సంస్థ దక్కన్ చార్జర్స్ జట్టును కొనుగోలు చేసింది. ఆ జట్టు తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా మారిన విషయం తెలిసిందే.

మొత్తంగా చూస్తే సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ద్వారా యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ వేల కోట్ల లాభాన్ని ఆర్జించడమే కాకుండా ఐపీఎల్ మార్కెట్ విలువ మరోసారి ఎంత భారీ స్థాయిలో ఉందో ఈ డీల్ ద్వారా స్పష్టమైంది.

Tags:    

Similar News