బీఆర్ఎస్ బీజేపీ కలిసినా ఓడిస్తామని రేవంత్ సవాల్
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లకు పంచులకు పెట్టింది పేరు. అలవోకగా పేపర్ కూడా చూడకుండా స్పీచ్ ఇవ్వగలరు, ప్రత్యర్ధులను తనదైన ఘాటు విమర్శలతో ఠారెత్తించగలరు.;
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లకు పంచులకు పెట్టింది పేరు. అలవోకగా పేపర్ కూడా చూడకుండా స్పీచ్ ఇవ్వగలరు, ప్రత్యర్ధులను తనదైన ఘాటు విమర్శలతో ఠారెత్తించగలరు. బహిరంగ సభ అయినా పార్టీ మీటిగ్ అయినా మీడియా మీట్ అయినా లేదా మీడియా డిబేట్ అయినా రేవంత్ రెడ్డి మాటల దూకుడే వేరుగా ఉంటుంది. ఆయన ప్రత్యర్ధులను గట్టిగా విమర్శలు చేస్తూ గాలి తీసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేటెస్ట్ గా ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ కి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణా రాజకీయాలు బీఆర్ఎస్ భవిష్యత్తు, కాంగ్రెస్ వ్యూహాలు లక్ష్యాలు, కేటీఆర్ గురించి ఇలా అనేక విషయాల మీద మాట్లాడుతూ తన పదునైన డైలాగులతో గులాబీ పార్టీకి గుండెల్లో గుచ్చేశారు.
కేసీఆర్ ప్రత్యర్ధి మాత్రమే :
ఇక కేసీఅర్ తో తనకు వ్యక్తిగత పంచాయతీలు లేవని అన్నారు. ఆయన తనకు ప్రత్యర్ధి మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ లో వారసత్వ రాజకీయం నడుస్తోంది అని విమర్శించారు కేటీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని ఆయన విమర్శించారు. ఎపుడూ గెలుస్తామని అంటారు తీరా ఓడిపోతూనే ఉంటారు అని బీఆర్ఎస్ గాలి తీసేశారు రేవంత్ రెడ్డి. ఇక ఒక్కరుగా విడిగా గెలవలేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కలసి తన మీదకు పోటీకి దిగాలని ఆయన సవాల్ చేశారు. అలా అయితే ఓడించి తీరుతామని ఆయన గట్టిగా చెప్పారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్నదే తన లక్ష్యమని అన్నారు.
జూబ్లీ హిల్స్ పందేలు :
ఆ మధ్య జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ ని నమ్ముకుని ఏకంగా 400 కోట్ల రూపాయల దాకా పందేలు కట్టి కొందరు నిలువునా మునిగిపోయారు అని రేవంత్ రెడ్డి సంచలన విషయాలనే చెప్పారు. ఆ ఉప ఎన్నికల్లో డ్యాం ష్యూర్ గా గెలిచేస్తున్నామని కేటీఆర్ చేసిన హడావుడితో చాలా మంది నమ్మి ఇలా పందేలలో సర్వం పోగోట్టుకున్నారు అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తున్నామని జబ్బలు చరచుకోవడం చివరికి చతికిల పడడం బీఆర్ఎస్ నేతలకు అలవాటే అని రేవంత్ రెడ్డి ఎత్తి పొడిచారు.
వరస పరాజయాలు :
ఇక బీఆర్ఎస్ పతనం చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచే స్టార్ట్ అయింది అని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలో మెజారిటీ సీట్లు ఓటమి చెందారని, 2024 లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అన్ని సీట్లూ మావే అని ముగ్గులోకి దిగారని తీరా ఫలితాలు చూస్తే గుండు సున్నా వచ్చిందని సెటైర్లు వేశారు. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగలేకపోయారని, సర్పంచు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కి 66 శాతం సీట్లు జనాలు కట్టబెట్టారని, అదే మున్సిపల్ ఎన్నికలు అయితే 90 శాతం సీట్లు తమకే ఇచ్చారని, వీటికి తోడుగా ఆ మధ్య జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలిచింది అని రేవంత్ రెడ్డి తెలంగాణా రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణా ట్రాక్ రికార్డు :
తెలంగాణా ప్రజలు 1995 నుంచి 2004 వరకూ చంద్రబాబుకు పదేళ్ళ పాటు అధికారం ఇచ్చారని అలాగే 2004 నుంచి 2014 వరకూ వైఎస్సార్ కి చాన్స్ ఇచ్చారని, 2014 నుంచి 2024 వరకూ కేసీఆర్ కి ఇచ్చారని, 2024 లో తనకు చాన్స్ ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజలు తమను దీవించి 2034 దాకా అధికారం ఇస్తారని ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. అందువల్ల ఏమి చేయాలి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. గులాబీ పార్టీవి ఆశలు ఆరాటం తప్ప వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ లో గుండు సున్నాయే అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
అన్ని గ్యారంటీలను అమలు :
తాము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆర్ధిక కారణాల వల్లనే రెండు గ్యారంటీలు పెండింగులో ఉన్నాయని వాటిని కూడా తొందరలో చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పదేళ్ళ పాటు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ తన చేతికి అప్పుల చిప్ప ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. అయినా సరే పేదల కష్టాలు చూసి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.