ఎంపీల వేత‌నం డ‌బుల్‌...డ‌బుల్‌

Update: 2015-12-24 13:24 GMT
దేశంలో అత్యున్న‌త పాల‌నా వ్య‌వ‌స్థ పార్ల‌మెంటు. దేశ ద‌శ దిశ‌ను మార్చే వ్య‌వ‌స్థ‌.. దేశ ప్ర‌గ‌తిని నిర్దేశించే భ‌వ‌నం.. అందుకే ఆ చ‌ట్ట‌స‌భ‌కు ఎంపికైన వారికి కూడా అంతే గౌర‌వం ఉంటుంది. ఈ చ‌ట్ట స‌భ‌కు ప్రాథినిత్యం వ‌హిస్తున్న ఎంపీల జీత‌భ‌త్యాలు త్వ‌ర‌లో పెర‌గ‌బోతున్నాయి.

ఎంపీల జీత‌భ‌త్యాలు మామూలుగా కాదు.. ప్ర‌స్తుతం వారు పొందుతున్న జీతభత్యాల కంటే రెట్టింపు మొత్తంలో వారికి అందనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల జీతాల రెట్టింపును ఖరారు చేసే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం ఎంపీకి రూ.50 వేలు చెల్లిస్తుండగా అది లక్షకు పెరగనుంది. అలాగే కార్యాలయ ఖర్చులు - నియోజకవర్గ అలవెన్సులు రూ.45 వేలు చెల్లిస్తుండగా దానిని 90 వేలు చేయనున్నారు. ఇతర అలవెన్సులు మరో లక్ష అందనున్నాయి.

 ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆర్థికశాఖ ఆమోదం లభిస్తే మొత్తం రూ.2.8లక్షల జీతభత్యాలు ఒక్కో లోక్ సభ - రాజ్యసభ సభ్యుడికి అందనున్నాయి. అయితే, చాలామంది నేతలకు తమ జీతాలను పెంచడం మాత్రం ఇష్టం లేదట. ఐటీ డిపార్ట్ మెంట్ వల్ల చిక్కులు వస్తాయని, అందుకే తమ అలవెన్సులు మాత్రం పెంచితే చాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2010లో ఒకసారి ఎంపీల‌కు జీతభత్యాలు పెంచారు. ప్ర‌స్తుతం మ‌రోసారి ఎంపీల జీతాల‌ను పెంచాల‌ని భావిస్తున్న ప్ర‌భుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వారి జీతాల పెంపు అంశాన్ని సభ ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. మ‌రి ఈ స్థాయిలో జీతాలు తీసుకుంటున్న నేత‌లు.. పార్ల‌మెంటులో కూడా అందుకు త‌గిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తూ...వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం పాటు ప‌డ‌కుండా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం కృషి చేయాల‌న్న వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News