ఓటర్లకు బురిడీ.. పంచేందుకు నకిలీ కరెన్సీ

Update: 2018-10-15 14:25 GMT
ఎన్నికలు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ఖర్చులు ఉంటాయి. మాటలకు తోడు కరెన్సీ కూడా కోటలు దాటుతాయి. ఛోటా - బడా నాయకులు - కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. మద్యం - నగదు విచ్చలవిడిగా పంపిణీ చేసేస్తుండాలి. మరి గెలవాలంటే ఇదంతా జరగాల్సిందే. ఈ క్రమంలో మధ్య ప్రదేశ్లో కొంతమంది అభ్యర్థులు నకిలీ కరెన్సీని ముద్రించడం మొదలుపెట్టారట.

మన తెలంగాణ మాదిరిగా మధ్య ప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. విచ్చలవిడిగా నగదు పంపిణీ జరుగుతుండటంతో నిఘా వేసిన పోలీసులు విస్తుపోయారు. కొత్తగా చలామణిలోకి వచ్చిన ఫేక్ రూ.500, రూ.2000 లను నోట్లను గుర్తించారు. భోపాల్లో నకిలీ నోట్లను ముద్రించిన ఘటన బయటకు వచ్చింది. నగరంలోని హోషానాబాద్, రాజ్ ఘఢ్ ప్రాంతాల్లో తనిఖీ చేసిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు.

ఈ నకిలీ నోట్ల వ్యవహారంలో మాజీ హాకీ క్రీడాకారుడు ఆఫ్తాబ్ అలీ అలియాస్ ముస్తాఖ్ ఖాన్ కీలక వ్యక్తిగా గుర్తించారు. ఇతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నట్లు తెలిపారు. అసలైన నోట్లను స్కాన్ చేసి నకిలీవి తయారుచేస్తున్నారని అన్నారు. ఏకంగా రూ.3కోట్లను ముద్రించినట్లు చెప్పారు.

విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని, ఈ తతంగంలో మరికొంత మంది ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు అన్నారు. ఏదిఏమైన ఎన్నికల్లో నేతలు అడ్డదారులు తొక్కేందుకు వెనుకాడడం లేదని స్పష్టమవుతోంది. ఈ నకిలీ కరెన్సీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News