అమ్మవార్ల చీరలనే దర్జాగా దొంగిలించేస్తున్నారు

Update: 2018-08-06 07:08 GMT
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. అమ్మవారి ఎదుట ఉంచిన విలువైన చీర ఒకటి మాయమవడం ఆలయంలో సంచలనంగా మారింది. అమ్మ వారికి సారె రూపంలో ఓ భక్తురాలు సమర్పించిన చీర మాయం కావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీర మాయం చేసి అమ్మవారికి అపచారం చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
   
గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు మహామంటపంలో అమ్మవారికి ఈ చీరను సమర్పించారు. దీని విలువ సుమారు రూ.18వేల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కొద్దిసేపటికే చీర కనిపించకుండా పోవడంపై ఆమె ఆవేదన చెందుతూ దీనిపై ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా మంగళగిరిలో నేయించి అమ్మవారికి సమర్పించేందుకు తీసుకొచ్చానని..  మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో అమ్మ వారి ఉత్సవ విగ్రహా వద్ద పూజలు నిర్వహించి - సారె సమర్పించిన తరువాత కొద్దిసేపటికే మాయమైందని అంటున్నారు. దీనిపై అర్చకులను అడగ్గా చీరల కౌంటర్లో నమోదు చేయించేందుకు పాలకమండలి సభ్యురాలు ఈ చీరను తీసుకెళ్లారని ఆర్చకులు ఆ భక్తురాలికి తెలిపారు. అయితే... కౌంటర్‌ లో తనిఖీ చేయగా అక్కడ నమోదు కాలేదు.
   
దీంతో విషయం బయటకు పొక్కడంతో సదరు పాలక మండలి సభ్యురాలు గుడికి వచ్చి,తాను చీర తీసుకెళ్లలేదని వివరణ ఇచ్చారు. యాదవ సంఘం ప్రతినిధులు తనకు కానుకగా ఇచ్చిన చీరను మాత్రమే తీసుకెళ్లానని స్పష్టం చేశారు. దీంతో ఆ చీరను ఎవరు మాయం చేశారో అర్ధంకాకపోవడంతో భక్తురాలు విజయవాడ వన్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. అనంతరం పోలీసులు - ఆలయ అధికారుల సహాయంతో సీసీ పుటేజీలను పరిశీలించారు. విచారణ చేపట్టారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం క్షేత్రంలో కూడా ఇదే రీతిలో అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్పించిన విలువైన చీర మాయమవడం తెలిసిందే.
Tags:    

Similar News