ఉచిత బస్సు ప్రయాణం...మగవారి మీదనే భారం

ఏదీ ఉచితంగా ఈ ప్రపంచంలో రాదు. ఎక్కడో ఎవరో చేసిన కష్టాన్ని మరొకరికి ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఉచితం అని పేరు పెట్టినా ఆ వెనక భారం మోసేది ఎవరో ఒకరు ఉంటారు అన్నది అంతా గుర్తు చేసుకోవాల్సి ఉంది.;

Update: 2025-12-08 01:30 GMT

ఏదీ ఉచితంగా ఈ ప్రపంచంలో రాదు. ఎక్కడో ఎవరో చేసిన కష్టాన్ని మరొకరికి ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఉచితం అని పేరు పెట్టినా ఆ వెనక భారం మోసేది ఎవరో ఒకరు ఉంటారు అన్నది అంతా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉంటే భార్యకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఖర్చు కలసి వస్తుంది అని అనుకుంటారు, కానీ అదే బస్సులో ప్రయాణించే భర్త తన టికెట్ తో పాటు పెంచిన చార్జీల భారం కూడా మోస్తే ఆ కుటుంబానికి ఏమి దక్కుతోంది, ఆర్ధికంగా ఏమి మిగులుతోంది అన్నదే అసలైన లాజిక్ పాయింట్.

నష్టాలలో బస్సు :

అసలే ఆర్టీసీ బస్సులు నష్టాలలో నడుస్తూంటాయి. ప్రైవేట్ వాహనాలు వెళ్ళని రూట్లలో బస్సులు తిప్పుతారు. దాంతో అక్కడ ఇంధన చార్జీలు కూడా రాక ఆర్టీసీ సతమతమవుతూంటుంది. అయితే ఎంతో కొంత నష్టం అయితే సర్కార్ సర్దుతుంది. కానీ ఏకంగా వందల కోట్లలో నష్టం వస్తే ఏమి చేయాలో పాలకులకు సైతం అర్థం కాని విషయంగా ఉంటుంది. ఇపుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల అదే రకమైన పరిస్థితి ప్రభుత్వాలకు వస్తోంది అని అంటున్నారు.

బాదుడు స్టార్ట్ :

దేశంలో చూస్తే ఉచిత బస్సు మహిళల కోసం నడుపుతోంది కేవలం మూడంటే మూడు రాష్ట్రాలు. అవి కర్ణాటక, తెలంగాణా, ఏపీ. ఇందులో మొదట ఉచిత బస్సు అన్నది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్ల ఈ హామీ ఇచ్చి గెలిచించి. ఆ వెంటనే పధకాన్ని అమలు చేసింది. అయితే రాను రానూ ఇది పెను భారం అని అర్ధం చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం బస్సు చార్జీలను గణనీయంగా పెంచేశాయి. కర్ణాటక ప్రభుత్వం అయితే కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులలో టికెట్లను పెంచేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఏడాది క్రితమే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 5 నుంచి అమలు చేస్తున్నారు కూడా.

నిర్వహణ ఖర్చుల కోసం :

ఇక కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఇంధన ధరలు మరియు గత బకాయిలను కవర్ చేయడానికి కర్ణాటక తన నాలుగు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో జనవరి 5, 2025నుండి 15 శాతం బస్సు ఛార్జీల పెంపును అమలు చేసింది , దీని మీద అక్కడ బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు పురుష ప్రయాణికులపై పెరిగిన భారాలను పేర్కొంటూ నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఈ చర్యను అవసరమని సమర్థించింది. ఈ పెరుగుదల సాధారణ మరియు ప్రీమియం బస్సులతో సహా అన్ని రకాల సర్వీసులను ప్రభావితం చేస్తుంది, దీని వల్ల నెలకు 74 కోట్లకు పైగా అదనపు ఆదాయం ఉంటుందని అంచనా వేసి మరీ పెంచారు. ఇక ఇపుడు కూడా ఆర్థిక భారం అధికంగా ఉండడంతో మరోసారి కూడా పెంచే ఆలోచన ఉందని ప్రచారం అయితే సాగుతోంది.

తెలంగాణా వంతు :

ఇపుడు చూస్తే తెలంగాణా రాష్ట్రం వంతుగా ఉంది. అక్కడ కూడా 2023 డిసెంబర్ నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకం అమలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా తెలంగాణలోనూ ఆర్టీసీ ఛార్జీలను పెంచచాలన్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం చూస్తే ముందు హైదరాబాద్ లో బస్సు ఛార్జీలను పెంచుతున్నారు. అక్కడ ప్రతీ టిక్కెట్ ధరపై అదనంగా పది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు పెద్ద ఎత్తున విన వస్తున్నాయి. ఈ భారం అంతా పురుషుల మీదకే వెళ్తుందని అంటున్నారు. నిజానికి ఉచిత బస్సు వచ్చాక మగవారికి కూర్చేందుకు సైతం సీటు దొరకడం లేదు, ఇపుడు వారే పెరిగిన టికెట్ల భారం మోస్తూ బస్సులో నిలబడాల్సి వస్తోంది అని అంటున్నారు. ఇది ఏ విధంగా సమంజసం అని అంటున్నారు.

ఏపీలో ఎపుడు అంటూ :

ఇక ఏపీలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ 2025 ఆగస్టు 15 నుంచే ఉచిత బస్సు పధకం అమలు చేస్తున్నారు. అయితే ఇది కూడా కొన్ని పరిమితులతో నడుపుతున్నారు. దాంతో కర్ణాటక తెలంగాణాల మాదిరిగా అపుడే భారాలు అంతగా పడకపోయినా ముందు ముందు ఏపీకి కూడా కష్టం నష్టం రావచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా పెరిగిన డీజిల్ ధరలు సాధారణ నిర్వహణ ఖర్చులు ఎప్పటికపుడు ఆర్టీసీకి భారాలుగా ఉంటున్నాయి. దానికి తోడు ఉచితాలు అంటే ఆర్టీసీలు కుదేలు అవుతాయని హెచ్చరికలు ఉన్నాయి. మరి కర్ణాటక తెలంగాణా మెల్లగా భారాలను తగ్గించుకునేందుకు టికెట్ల ధరలు పెంచుతున్నారు. ఏపీలో కూడా ఎపుడైనా జరగవచ్చు అంటున్నారు.

పెద్దాయన మాటలు :

వీటి మీద మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదే పదే ప్రభుత్వాలకు హిత బోధ చేస్తున్నారు. ఉచితాలు కేవలం విద్య వైద్యంలో మాత్రమే ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అంతే తప్పించి ఇతర రకాలైన వాటికి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఉచిత బస్సు పధకం మీద ఆయన గతంలోనూ వద్దు అనే చెబుతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం అనుసరిస్తూ భారాలు మోయలేక భంగపడుతున్నాయి. ఒక కుటుంబంలో మహిళా ఓట్లను గురి పెడుతున్నారు, కానీ అదే కుటుంబంలో మగవారి ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తోంది అన్న సత్యాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ఉచిత బస్సులు ఏ స్టేషన్ వద్ద ఆగుతాయో.

Tags:    

Similar News