ట్రంప్ పేరుతో రోడ్డు...బీజేపీ కొత్త లాజిక్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. రెండోసారి ఆయన అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధిపతిగా ఎన్నిక అయ్యారు.;

Update: 2025-12-08 03:33 GMT

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. రెండోసారి ఆయన అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధిపతిగా ఎన్నిక అయ్యారు. మొదటి దఫాలో భారత్ తో మోడీతో ఎంతో సన్నిహితమైన స్నేహ సంబంధాలను నెరిపిన ట్రంప్ రెండవ సారి అధికారంలోకి వస్తూనే భారత్ మీద కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు అన్నది అందరి మాటగా ఉంది. ట్రంప్ భారత్ మీద విధించిన అధిక వాణిజ్య సుంకాల మూలంగా దేశం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతే కాదు భారతీయుల విషయంలో అమెరికాలో అనుసరిస్తున్న విధానాలు కూడా కన్నెర్రగా మారుతున్న నేపథ్యం ఉంది. ఈ కీలక సమయంలో ట్రంప్ అంటే భారతీయులు అంత సానుకూలంగా ఏమీ లేరని అందరికీ తెలుసు. కానీ తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ట్రంప్ పేరుని ఒక హైదరాబాద్ లోని ఒక రోడ్డుకు పెట్టాలని ఆలోచిస్తోంది అన్న వార్తలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి.

ప్రముఖుల పేర్లతో పాటు :

ఇదిలా ఉంటే హైదరబాద్ లోని కీలక రహదార్లకు ప్రముఖుల పేర్లను పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. గచ్చీ బౌలిలోని యూఎస్ కాన్సులెట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం అయితే ఒక డెసిషన్ తీసుకుంది అని చెబుతున్నారు. అలాగే రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఉన్న వంద మీటర్ల గ్రీన్‌‌ఫీల్డ్ రేడియల్ రహదారికి ఇటీవలనే దివంగతులు అయిన ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరు పెట్టాలని అనుకుంటోంది.

గూగుల్, విప్రోల పేర్లతో :

అంతే కాదు ఐటీ కారిడార్ ముఖ్యమైన రహదారులకు గూగుల్ స్ట్రీట్ గా అలగే విప్రో జంక్షన్ గా మైక్రో సాఫ్ట్ రోడ్డుగా పేర్లు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ప్రభావితం చేశారు కాబట్టి వారికి గౌరవం ఇవ్వడంతో పాటు హైదరాబాద్ కి అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ మార్గాన ప్రయాణించే వారికి కూడా ఈ పేర్లు మదిలో మెదిలి స్పూర్తిని ఇస్తాయని కూడా భావిస్తోంది.

తుది నిర్ణయం కోసం :

ఇదిలా ఉంటే ట్రంప్ పేరు పెట్టాలి అంటే అమెరికా రాయబారం కార్యాలయం అనుమతి ఉండాలని అంటున్నారు. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అనుమతించాలి. అలాగే విదేశీ కంపెనీల పేర్ల విషయంలో కూడా లాంచనాలు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని ఆ మీదట తమ నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అని అంటున్నారు ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖలు రాయనుందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి మరి అనుమతులు వస్తే కనుక ఈ నిర్ణయాలు అమలు అవుతాయని అంటున్నారు. అయితే ట్రంప్ విషయంలో మాత్రం జనంలో ఏ రకమైన అభిప్రాయం వస్తుందో అన్నది కొంత చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

ఆరాటం ఉంటే కనుక :

పేర్లను మార్చి కొత్తవి పెట్టాలని ఉన్నా లేక కొత్తగా పేర్లు పెట్టాలని ఆరాటం ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందని బీజేపీ అంటోంది. ముందు హైదరాబాద్ కి భాగ్యనగరం పేరు పెట్టాలని సూచిస్తోంది. ఆ పేరు మార్చిన తరువాతనే మిగిలినవి అన్నీ చేయాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే భాగ్యనగరంగా హైదరాబాద్ పేరు మార్చాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో పేర్ల దగ్గర కొత్త లడాయి అయితే మొదలైంది. అది ఏ వైపుగా సాగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News