అన్నమయ్య... జిల్లాపై క్లారిటీ..!
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విషయంపై అనేక చర్చలు, అనుమానాలు, డిమాండ్లు కూడా తెరమీదికి వచ్చాయి.;
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విషయంపై అనేక చర్చలు, అనుమానాలు, డిమాండ్లు కూడా తెరమీదికి వచ్చాయి. వాస్తవానికి వైసీపీ హయాంలోనే అన్నమయ్య జిల్లా ఏర్పాటు.. దీనికి కేటాయించిన జిల్లా కేంద్రంపైనా వివాదాలు సాగాయి. నెలల తరబడి ఇక్కడి ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రంగా ఉంది. కానీ.. దీనిని కాదని.. రాజంపేటను కేంద్రంగా మార్చాలన్నది ఇక్కడి వారి డిమాండ్.
దీనిపైనే గతంలోనూ వివాదాలు ముసురుకున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పట్టుబట్టారు. అయితే.. తాజాగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం జిల్లా కేంద్రాలను కూడా మార్పు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మార్పు చేయాలని.. వైసీపీ హయాంలో జరిగిన ఏర్పాటును ఇక్కడి వారు తప్పుబడుతున్నారు. అయితే.. ప్రభుత్వం ఈ విషయంలో మళ్లీ పాత విధానానికే మొగ్గు చూపింది.
ప్రస్తుతం ఉన్న రాయచోటి కేంద్రాన్ని కదిపేదిలేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ విషయంలో మరో మాట కూడా లేదని.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మాత్రమే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి వైసీపీ ఏర్పాటు చేసినప్పుడే వివాదం చెలరేగినా.. ఇప్పుడు అన్నీ అక్కడే కేంద్రీకృతం అయ్యాయని.. దీంతో మార్పు లేదని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
వాస్తవానికి రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వెనుక.. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ది స్థానికంగా జరిగిన చర్చ. దీనిని వైసీపీలోని కొందరు నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయి నప్పటికీ వైసీపీ ఈ జిల్లా కేంద్రాన్ని మార్పు చేయలేదు. ఇప్పుడు కూటమి సర్కారు కూడా.. రాయచోటికే మొగ్గు చూపడం గమనార్హం. సో.. దీంతో పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చన్నది మంత్రి చెప్పిన మాట.